Forex Reserve | విదేశీ మారక నిల్వలు 1.05 బిలియన్ డాలర్లు పెరిగి 630.61 బిలియన్ డాలర్లకు చేరినట్లుగా ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరి 31తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు 5.57 బిలియన్ డాలర్లు పెరిగి 629.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా రెండోవారం కూడా పెరిగాయి. వాస్తవానికి గత కొద్దిరోజుల కిందట వరుసగా ఫారెక్స్ నిల్వలు భారీగా పడిపోయాయి. రీవాల్యయేషన్తో పాటు రూపాయి మారకంలో హెచ్చుతగ్గులను తగ్గించేందుకు ఆర్బీఐ జోక్యవడమే ఈ పతనానికి కారణంగా విశ్లేషకులు భావించారు.
గతేడాది సెప్టెంబర్ చివరినాటికి విదేశీ మారక నిల్వలు అత్యధికంగా 704.88 బిలియన్ డాలర్లకు పెరిగాయి. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జనవరి 31తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 207 మిలియన్ డాలర్లు తగ్గి 537.68 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ రూపంలో పేర్కొన్న విదేశీ కరెన్సీ ఆస్తులు యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్యేతర కరెన్సీల్లో హెచ్చుతగ్గులు దీనికి కారణం. సమీక్షస్తున్న వారంలో బంగారం నిల్వల విలువ 1.24 బిలియన్ డాలర్లు పెరిగి 70.89 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) 29 మిలియన్లు పెరిగి 17.89 బిలియన్లకు చేరింది.