ముంబై, డిసెంబర్ 5 : విదేశీ మారకం నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. నవంబర్ 28తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.877 బిలియన్ డాలర్లు తగ్గి 686.227 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. మరోవైపు, గతవారాంతానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.569 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టడం మొత్తం రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపిందని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
మరోవైపు, గోల్డ్ రిజర్వులు మాత్రం 1.613 బిలియన్ డాలర్లు ఎగబాకి 105.795 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కేవలం 63 మిలియన్ డాలర్లు పెరిగి 18.628 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఐఎంఎఫ్ వద్దవున్న దేశీయ నిధులు 16 మిలియన్ డాలర్లు అధికమై 4.772 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.