న్యూఢిల్లీ, మే 24: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమవుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా తగ్గుముఖం పట్టిన ఎఫ్‌డీఐలు..గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి కేవలం 353 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతక్రితం ఏడాది వచ్చిన 10 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో పోలిస్తే 96.5 శాతం తగ్గాయని పేర్కొంది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయి ఎఫ్‌డీఐలను ఆకర్శించిన భారత్.. ఆ మరుసటి ఏడాదే భారీగా పడిపోవడం విశేషం. కానీ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టే దేశీయ కంపెనీలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆయా సంస్థలు 29 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. అంతక్రితం ఏడాది పెట్టిన 17 బిలియన్ డాలర్ల కంటే ఇది 50 శాతానికి పైగా అధికం.
ప్రపంచ దేశాల్లో భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో గడిచిన కొన్నేండ్లుగా భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు..గతేడాది పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజవేశారు. కానీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మాత్రం ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇతర దేశాల ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే సెన్సెక్స్, నిఫ్టీలు రెండంకెల స్థాయిలో రాబడిని పంచడమే ఇందుకు కారణం.
మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 13.7 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటిలో సగం ఐపీవోకి వచ్చిన సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. 2023-24 సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు 49 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ అండ్ పార్టనర్స్ గ్రూపు, స్విగ్గీ, విశాల్ మెగా మార్ట్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐలు అత్యధికంగా వచ్చాయి. అలాగే అల్ట్రార్నెటివ్ క్యాపిటల్ అసోసియేషన్(ఐవీసీఏ), ఈవై, పీఈ/వీసీ ల నుంచి 26.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
హ్యుందాయ్ మోటర్ ఇండియా తన వాటాను 100 శాతం నుంచి 82.5 శాతానికి తగ్గించుకోవడంతో రూ.27,870 కోట్ల నిధులు సమకూరగా, అలాగే స్విగ్గీ కూడా 2 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. వీటితోపాటు టెలికం దిగ్గజం సింగ్టెల్..భారతీ ఎయిర్‌టెల్‌లో తనకున్న వాటాను మొత్తం విక్రయించగా, అలాగే బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ)..ఐటీసీలో ఉన్న తన మొత్తం వాటాను విక్రయించింది. గతేడాది సెప్టెంబర్ నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో ఒక్కో విదేశీ కంపెనీలు..దేశీయ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో తయారీ రంగంతోపాటు ఆర్థిక సేవలు, ఎనర్జీ, కమ్యూనికేషన్ రంగాలు విఫలమయ్యాయి. గత కొన్నేండ్లుగా ఈ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చలేకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు వీటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. తయారీ, ఆర్థిక సేవలు, ఎనర్జీ, టెలికం రంగాల్లోకి ఎఫ్‌డీఐలు భారీగా తగ్గడం మొత్తం ఎఫ్‌డీఐలపై ప్రతికూల ప్రభావం చూపాయని సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించింది.