న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థలు ఇందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే కార్యాలయ స్థలాలకు భారీగా డిమాండ్ నెలకొంటున్నది. ఈ ఏడాది జనవరి-జూన్లో హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ రికార్డు స్థాయిలో 7.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తాజాగా వెల్లడించింది. నిరుడుతో పోల్చితే ఇది 70 శాతం అధికం కావడం గమనార్హం. గత ఏడాది తొలి 6 నెలల్లో జీసీసీల కోసం 4.31 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ మాత్రమే లీజింగ్ జరిగింది.
అయితే ఆసక్తికరంగా విదేశీ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు పడిపోతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో 4.13 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్కే పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో జీసీసీల ఏర్పాటు కోసం 5.71 మిలియన్ చదరపు అడుగులను ఆయా కంపెనీలు లీజుకు తీసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా గుర్తుచేసింది. అంతేగాక గ్లోబల్ తయారీ రంగ కంపెనీలూ జీసీసీల ఏర్పాటుకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ను ఈసారి 4.05 మిలియన్ చదరపు అడుగులకు తగ్గించేశాయి. నిరుడు జనవరి-జూన్లో 4.67 మిలియన్ చదరపు అడుగులను అద్దెకు తీసుకున్నాయని వివరించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో జీసీసీల కోసం జరుగుతున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్పై నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది.