హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశీయ అతిపెద్ద లగ్జరీ క్యాటరింగ్ సంస్థల్లో ఒకటైన ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్ హైదరాబాద్కు వస్తున్నది. రూ.100 కోట్లదాకా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించిన ఈ సంస్థ.. ఇక్కడి వ్యాపార విస్తరణ గురించి తాజాగా వివరించింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓ సువిశాల ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ సీఈవో సంజయ్ వజిరాణి తెలిపారు. ఇందులో 6,000 చదరపు అడుగుల గిడ్డంగి, 9,000 చదరపు అడుగుల అత్యాధునిక వంటగది సదుపాయం ఉంటాయన్నారు. బల్ ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు, శీతల వంటశాలలు, బేకరీ, వెజిటబుల్ ప్రాసెసింగ్ సెంటర్, సిబ్బంది శిక్షణా సదుపాయం, విశాలమైన సమావేశ గదులు ఉండనున్నాయి. కాగా, భారత్లో ప్రస్తుతం అహ్మదాబాద్, చంఢీగడ్, ఢిల్లీల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. దక్షిణాదిలోకి హైదరాబాద్ ద్వారానే ప్రవేశిస్తున్నది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.450 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, రాబోయే 3 నుండి 4 ఏండ్లలో రూ.800-1,000 కోట్లకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సంజయ్ వివరించారు. 10 దేశాల్లో క్లయింట్లు, 25కుపైగా దేశాల్లో ఈవెంట్లు నిర్వహించిన ఏకైక భారతీయ క్యాటరర్ తామేనన్నారు.