తిరుపతి-హైదరాబాద్ మధ్య ఫ్లై91 డైరెక్ట్ ఫ్లైట్
తిరుపతి, సెప్టెంబర్ 10: తిరుపతి నుంచి హైదరాబాద్‌తోపాటు విజయవాడ, రాజమండ్రి మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది ఫ్లై91 ఎయిర్‌లైన్స్. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. దీంతో తిరుపతి-విజయవాడ-తిరుపతి మధ్య విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో మొత్తం రూట్ల సంఖ్య 13కి చేరుకున్నట్టు ఫ్లై91 ఫౌండర్, ఎండీ మనోజ్ చాకో తెలిపారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సంస్థ నాలుగు నగరాలకు విమాన సర్వీసులు అందించినట్టు అయిందన్నారు.
తెలుగు రాష్ర్టాల నుంచి తిరుపతి సందర్శించే యాత్రికులు అధికంగా ఉంటున్నారని, దీంతో ప్రాంతీయ కనెక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులను తెచ్చినట్టు చెప్పారు. త్వరలో తిరుపతి-హైదరాబాద్ మధ్య సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. తిరుపతి-విజయవాడ మధ్య విమాన సర్వీసు వారానికి నాలుగు రోజులు(మంగళ, గురు, శుక్ర, ఆదివారాలు) మాత్రమే నడువనుండగా, తిరుపతి-రాజమండ్రి మధ్య వారానికి మూడు రోజులు(సోమ, బుధ, శుక్రవారాలు) నడుపనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థ గోవా, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హుబ్లీ, కొచి, హైదరాబాద్, బెంగళూరు, పుణె, సోలాపూర్‌కు విమాన సర్వీసులు నడుపుతున్నది.