సోమవారం 30 మార్చి 2020
Business - Feb 22, 2020 , 03:42:18

టోకు వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్‌

టోకు వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్‌
  • ఇప్పటికే ఢిల్లీలో ఎఫ్‌ఎంసీజీ పైలట్‌ ప్రాజెక్టు
  • వచ్చే త్రైమాసికంలో ప్రారంభం..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌ ఆధీనంలో పనిచేస్తున్న దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వచ్చే ఆర్థిక సంవత్సర (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో తన టోకు (హోల్‌సేల్‌) వ్యాపారాన్ని ప్రారంభించనున్నది. తద్వారా తన ప్రధాన ప్రత్యర్థి అయిన అమెజాన్‌ బీ2బీ (బిజినెస్‌ టు బిజినెస్‌) డివిజన్‌తోపాటు రిలయన్స్‌ మార్కెట్‌, టెన్సెంట్‌ ప్రోద్బలంతో ముందుకు సాగుతున్న ఉడాన్‌ లాంటి ఈ-కామర్స్‌ స్టార్టప్‌లతో పోటీపడేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ గత కొన్ని నెలల నుంచి తన సైప్లె చైన్‌ సామర్థ్యాలను పెంపొందించుకోవడంతోపాటు ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతున్నదని, అంతేకాకుండా ఢిల్లీ ఎన్సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌)లోని కిరాణా దుకాణాలకు సరుకులను సరఫరా చేసేందుకు ప్రయోగాత్మకంగా ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) ప్రాజెక్టును నడుపుతున్నదని అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి. కిరాణా దుకాణాలకు సరఫరాచేసే సరుకుల సేకరణను పెంపొందించేందుకు అవసరమయ్యే పెట్టుబడుల విషయమై బీ2బీ ఎఫ్‌ఎంసీజీ సైప్లె చైన్‌ స్టార్టప్‌ ‘జంబోటెయిల్‌'తో కూడా ఫ్లిప్‌కార్ట్‌ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన పలువురు ఉన్నతోద్యోగులు చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ తొలుత ఎఫ్‌ఎంసీజీతోపాటు తాజా ఆహారపదార్థాలపై దృష్టిసారించి హోల్‌సేల్‌ వ్యాపారాన్ని ప్రారంభించనున్నదని, ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని మరిన్ని క్యాటగిరీలకు విస్తరించనున్నదని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫ్లిప్‌కార్ట్‌ తన సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఆదర్శ్‌ మీనన్‌ను సారథిగా నియమించడంతోపాటు గత ఐదు నెలల్లో తమ కన్జ్యూమర్‌ మార్కెట్‌ డివిజన్‌కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లను హోల్‌సేల్‌ బిజినెస్‌ డివిజన్‌కు బదిలీ చేసిందన్నారు. దేశంలో కిరాణా దుకాణదారులకు, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు చేయూతనిచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడేందుకు బీ2బీ సెగ్మెంట్‌ను మంచి అవకాశంగా భావిస్తున్నామని, కిరాణా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దడంలో టెక్నాలజీ కీలకపాత్ర పదోషించగలదని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రైతుల నుంచి నేరుగా జరిపే కొనుగోళ్లను పెంపొందించేందుకు డిసెంబర్‌లో ‘నీంజాకార్ట్‌' (పండ్లు, కూరగాయల సరఫరా సంస్థ)లో పెట్టుబడులు పెట్టిన ఫ్లిప్‌కార్ట్‌.. ఫుడ్‌ రిటైల్‌ క్యాటగిరీలో ప్రవేశించేందుకు అక్టోబర్‌లో ‘ఫ్లిప్‌కార్ట్‌ ఫార్మర్‌మార్ట్‌' పేరిట ఓ సంస్థను రిజిస్టర్‌ చేయడంతోపాటు బీ2బీ లాస్ట్‌-మైల్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘షాడోఫాక్స్‌'లో పెట్టుబడి పెట్టింది.


అవిశ్వాస దర్యాప్తుపై పిటిషన్‌

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తమపై అవిశ్వాస దర్యాప్తునకు ఆదేశించడాన్ని ఫ్లిప్‌కార్ట్‌ సవాలు చేసింది. ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌ తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి అమెజాన్‌ బాటలోనే నడుస్తున్నది. పలు రకాల వస్తువులపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తమ కొనుగోలుదారులకు అక్రమంగా రాయితీలు ఇస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు రావడంతో ఆ రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలపై దర్యాప్తు జరుపాలని సీసీఐ గత నెలలో ఉత్తర్వు జారీచేసింది. దీనిపై అమెజాన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో గత వారం ఓ రాష్ట్ర కోర్టు ఆ దర్యాప్తును నిలిపివేసింది. సీసీఐ ఉత్తర్వుపై ఫ్లిప్‌కార్ట్‌ కూడా అసంతృప్తితో ఉన్నదని, అందుకే అవిశ్వాస దర్యాప్తును సవాలుచేస్తూ బెంగళూరులోని కోర్టులో ఈ నెల 18న పిటిషన్‌ దాఖలు చేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఓ వ్యక్తి వెల్లడించారు. ఈ-కామర్స్‌ రంగంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను భారత్‌ కఠినతరం చేస్తున్నదని ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో తన పర్యటనను ప్రారంభంకావడానికి కొద్ది రోజుల ముందు ఫ్లిప్‌కార్ట్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. వ్యాపారంలో తాము అనుసరిస్తున్న విధానాలు పోటీని దెబ్బతీస్తున్నాయని చెప్తున్న సీసీఐ.. ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తమపై దర్యాప్తునకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్‌ ఆ పిటిషన్‌లో ఆరోపించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరిగే అవకాశమున్నది.


logo