Interest Rate | గృహ రుణం తీసుకునేటప్పుడు రుణగ్రహీ తలు వడ్డీరేట్లపై వివేకంతో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే లక్షల రూపాయల్లో నష్టపోవాల్సి ఉంటుంది. ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ గురించి మీకు తెలుసా? వాటి మధ్య తేడాలు? ఏది లాభమో పరిశీలిస్తే..
ఫ్లాట్ రేట్ అంటే?
రుణంపై ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే.. మీరు తీసుకున్న మొత్తం రుణంపై ఎంచుకున్న కాలపరిమితి అంతా వడ్డీరేటు ఒకేలా ఉంటుంది. ఏ రకంగానూ ఇందులో మార్పుండదు. ఫలితంగా మీ నెలవారీ ఈఎంఐలు రుణం ఆరంభంలో ఎలా ఉంటాయో.. రుణం ఆఖర్లో కూడా అలాగే ఉంటాయి. ఇందులో వడ్డీని రుణగ్రహీతలు అధికంగా చేయాల్సి వస్తుంది. రుణంపై ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్‌తో ఈఎంఐ ఎంత? ఉంటుంది అన్నది ఆన్లైన్లో లభించే క్యాలిక్యులేటర్లోనూ చూసుకోవచ్చు.
రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ అంటే?
తీసుకున్న రుణంలో నెలనెలా చెల్లించగా మిగిలిన అసలు రుణ మొత్తాల ఆధారంగానే వడ్డీని ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ విధానంలో లెక్కిస్తారు. అంటే ప్రతీ నెలా వడ్డీ మొత్తాలు తగ్గుతూపోతాయన్నమాట. ఒకవేళ బ్యాంక్ తమ వడ్డీరేట్లకు కోత పెడితే మీ ఈఎంఐలు సైతం తగ్గుతాయి. లేదా కాలపరిమితి తగ్గుతుంది. దీనివల్ల రుణగ్రహీతపై చాలాచాలా వడ్డీభారం దిగొస్తుంది. ఆన్లైన్లో లభించే క్యాలిక్యులేటర్ ద్వారా పరిశీలించవచ్చు.
ఉదాహరణ..
సురేశ్, మహేశ్ వేర్వేరుగా రూ.15 లక్షల గృహ రుణాన్ని 8.5 శాతం వార్షిక వడ్డీరేటుకు 25 ఏండ్ల కాలపరిమితితో తీసుకున్నారు. అయితే సురేశ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్‌ను ఎంచుకున్నాడు. కానీ మహేశ్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్‌తో తీసుకున్నాడు. దీంతో సురేశ్ ఈఎంఐ రూ.12,078గా, రుణంపై చెల్లించే వడ్డీ రూ.21,23,522గా ఉన్నాయి. మొత్తం 25 ఏండ్లలో రూ.36,23,522 చెల్లించాల్సి వస్తున్నది. అయితే మహేశ్ ఈఎంఐ రూ.15,625గా, వడ్డీ రూ.31,87,500గా ఉన్నాయి. మొత్తం 25 ఏండ్లలో రూ.46,87,500 చెల్లించాల్సి వస్తున్నది. దీంతో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్‌ను ఎంచుకోవడం వల్ల సురేశ్‌కు ఇంటి రుణంపై రూ.10,63,978 మేర వడ్డీ భారం తగ్గినట్టవుతున్నది.
05