Petrol Fuelling | పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయినప్పుడల్లా వాహనదారులంతా ఆందోళన చెందుతుంటారు. ఇదిలా ఉంటే పెట్రోల్ బంక్‌ల వద్ద బైక్‌లో గానీ, స్కూటర్లలో గానీ పెట్రోల్ నింపుకునే టైంలో మోసాలను తెలుసుకునేందుకు జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ పంపుల వద్ద మోసాల పట్ల కాసింత అవగాహన కలిగి ఉంటే మీ మనీ పొదుపు చేయొచ్చు.
కస్టమర్లు అలర్ట్‌గా లేకుంటే పెట్రోల్ బంకుల వద్ద పని చేసే బాయ్‌లు తేలిగ్గా మోసం చేయడం సాధారణం. కస్టమర్ తన బైక్ లేదా స్కూటర్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపమంటాడు.. కానీ, ఫ్యుయల్ మీటర్ రీసెట్ చేయకుండా పెట్రోల్ నింపాడనుకోండి. తక్కువ పెట్రోల్ మాత్రమే నింపుతారు.. మనీ మాత్రం ఫుల్ ట్యాంక్‌కు సరిపడా పే చేయాల్సి ఉంటది.
ఉదాహరణకు మీరు రూ.1000 విలువైన పెట్రోల్ నింపమని కోరారనుకుందాం.. అప్పుడు పెట్రోల్ బంక్ బాయ్ ఫ్యూయల్ మీటర్ జీరోకు రీసెట్ చేయకుండానే.. రూ.200 వద్ద ఉండగానే అలాగే రూ.1000 వరకు ఫ్యుయల్ నింపారనుకోండి. మీ బైక్ ట్యాంక్‌లో రూ.800 విలువైన పెట్రోల్ మాత్రమే నింపుతారు.. కానీ పూర్తిగా రూ.1000 పే చేయాల్సిందే. పెట్రోల్ నింపుతున్నప్పుడు మీరు రీడింగ్ మీటర్‌పైనే దృష్టి పెట్టాలి సుమా..!
కొన్ని సార్లు ఫ్యుయల్ డిస్పెన్సింగ్ మిషన్లలో ఎలక్ట్రానిక్ చిప్‌లు ఇన్స్టాల్ చేస్తారు. దీని ద్వారా తక్కువ ఆయిల్ నింపినా మీటర్లో రీడింగ్ చూపిన మొత్తానికి బిల్లు పే చేయాల్సిందే. 2020లో తెలంగాణలో ఇటువంటి ఘటన వెలుగు చూసింది. ఎలక్ట్రానిక్ చిప్‌లు ఇన్స్టాల్ చేసిన పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్‌కు 970 మి.లీ ఫ్యుయల్ మాత్రమే నింపిన ఘటన వెలుగు చూసింది.
పెట్రోల్ పరిమాణంపై సందేహం వస్తే ఐదు లీటర్ల పరిమాణంపై పరీక్షించాలని కోరాలి. పెట్రోల్ పంపులో తూనికలు మరియు కొలతల విభాగం అధికారులు ఐదు లీటర్ల పరిమాణంపై సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఫ్యుయల్ డిస్పెన్సింగ్ మిషన్ నుంచి ఒకవేళ ఐదు లీటర్ల పెట్రోల్ పంప్ చేశారనుకుంటే.. మీ వెహికల్లో షార్ట్ ఫ్యుయలింగ్ చేయడం లేదని మీరు నిర్ణయానికి రావచ్చు. ఇదే అన్ని పెట్రోల్ పంపుల్లో చెక్ చేయాలి.
ఇప్పుడు వెహికల్ యజమానుల పర్మిషన్ లేకుండానే సింథటిక్ ఆయిల్ నింపడం అలవాటుగా మారింది. రెగ్యులర్ ఆయిల్‌కు బదులు సింథటిక్ ఆయిల్ నింపడం కొత్త ట్రిక్‌గా మారింది. కస్టమర్ పర్మిషన్ తీసుకోకుండానే సింథటిక్ ఆయిల్ నింపడం వల్ల 5-10 శాతం ఎక్కువ ధర పే చేయాల్సి వస్తుంది. కనుక ముందే హై-పెర్ఫార్మెన్స్ ఫ్యుయల్ నింపొద్దని పెట్రోల్ పంప్ బాయ్‌లకు చెప్పేయడం బెటర్.
మీకు పెట్రోల్ క్వాలిటీపై డౌట్ వస్తే.. మీ వెహికల్లో పెట్రోల్ నింపిన తర్వాత ఇంజిన్ ఫిల్టర్ పేపర్ టెస్ట్ నిర్వహించమని కోరాలి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రతి పెట్రోల్ పంప్ వద్ద ఫిల్టర్ పేర్లు తప్పనిసరిగా ఉండాలి. కస్టమర్ అడిగినప్పుడు అందజేయాలి. ఒకవేళ పెట్రోల్ కల్తీ చేశారా.. లేదా అని తేలుతుంది. కొన్ని పెట్రోల్ చుక్కలు ఫిల్టర్ పేపర్‌పై పడగానే.. మచ్చలు ఏర్పడతాయి. అలా మచ్చలు ఏర్పడితే కల్తీ పెట్రోల్ అని తేలిపోతుంది. క్వాలిటీ లేని పెట్రోల్ వాడకం వల్ల మీ వెహికల్ పలు మార్గాల్లో దెబ్బ తింటుంది. వెహికిల్ సామర్థ్యం తగ్గుతుంది. ఇంజిన్, ఇతర విడి భాగాల లైఫ్ తగ్గిపోతుంది.
మీరు పెట్రోల్ పంపులోకి వెళుతుండగానే పెట్రోల్ ధర ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.డిస్పెన్సింగ్ మిషన్‌లో డిస్ప్లే అవుతున్న ధర, వాస్తవ ధర సరిపోతుందా.. లేదా.. అని చెక్ చేసుకోవాలి. పెట్రోల్ కొనుగోలుపై క్యాష్ మెమో ఇవ్వమని కూడా అడగవచ్చు.