ఆశయం లేని జీవితం.. అర్థవంతంగా ఉండదు. అలాగే ఆర్థిక లక్ష్యాల సాధనకు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాల్సిందే. లేకపోతే గురితప్పి దారీతెన్నూలేని అగాథంలో పడిపోతాం. నిజానికి నేటి యువత ఆరంభంలోనే ఆకర్షణీయ జీతాలను అందుకుంటున్నది. ఈ క్రమంలో భవిష్యత్తుపై పెద్దపెద్ద ఆశల్నే పెట్టుకుంటున్నది. అయితే అవగాహన లేక ఎంతోమంది తమ లక్ష్య సాధనలో మధ్యలోనే నీరసించి ఆగిపోతున్నారు. అలాంటివారంతా ఓ నిర్ధిష్ట పద్ధతిలో ముందుకెళ్తే అనుకున్నది సాధించి విజేతలుగా నిలవడం సాధ్యమే. అందుకే ఈ ఐదు సూత్రాలను పాటించి ఆనందమయ జీవితానికి చేరువవ్వండి.
జీవిత-ఆరోగ్య బీమా
ప్రతీ మనిషికి బీమా ఎంతో అవసరం. ఒకప్పుడు జీవిత బీమాకే ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆరోగ్య బీమాకూ అవసరం పెరిగింది. కనుక తమతమ ఆర్థిక లక్ష్యాల సాధనలో అందరికీ బీమా ధీమా ఉండాల్సిందే. కుటుంబానికి ఆధారమైనవారు అర్ధాంతరంగా తనువు చాలిస్తే.. ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంక్షోభంలో పడ్డట్టే. అటువంటి పరిస్థితుల్లో దన్నుగా నిలిచేది జీవిత బీమా ద్వారా వచ్చే ధనమే. ఇక ఇటీవలికాలంలో ఎప్పుడు ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుం దో తెలియని దుస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కరోనా వచ్చిన దగ్గర్నుంచి పరిస్థితులు తలకిందులైపోయాయి. దవాఖానల్లో వైద్య ఖర్చుల కోసం ఉన్నదంతా ఊడ్చేయాల్సి వస్తున్నదన్నా అతిశయోక్తి కాదు. అందుకే ఆరోగ్య బీమా అనేది ఎవరికైనా తప్పనిసరి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం బీమాతోనే సాధ్యం.
మెరుగైన ఆదాయం
ఆదాయ మార్గాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూపోవాలి. ఉద్యోగాలైనా.. వ్యాపారాలైనా.. స్థిరంగా సాగని రోజులివి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలను కలిగి ఉండటం తెలివైనదిగానే చెప్పుకోవచ్చు. రేపన్నది ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మీరు సంపాదించగలిగినప్పుడే నాలుగు రూపాయలు ఎక్కువగా సంపాదించుకోవాలి. అలాగని శక్తికి మించిన భారాన్ని మోయవద్దు. దీనివల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీకు వీలున్నంత మేరకే కష్టించి కూడబెట్టుకోండి. అవకాశం ఉన్నప్పటికీ ఒక్క ఆదాయ వనరుతోనే సరిపెట్టుకోవడం సరికాదు. వీలైతే మీ భాగస్వాముల నుంచీ తగిన మద్దతును అందిపుచ్చుకోండి.
పొదుపు-పెట్టుబడులు
పొదుపు-పెట్టుబడులు సజావుగా సాగినప్పుడే జీవితంలో ఆర్థికపరంగా ఆకర్షణీయమైన వృద్ధిని అందుకోగలం. సేవింగ్స్ ఎంత ముఖ్యమో.. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే ప్రాధాన్యమని గుర్తించాలి. ఎక్కడ? ఎలా? పొదుపు చేస్తే అధిక రాబడులను అందుకుంటామో చూసుకొని ముందుకెళ్లండి. అలాగే పెట్టుబడులు ఏ రంగంలో పెడితే ఇంకా పెరుగుతాయో అన్వేషించండి. ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. నిపుణుల సలహాతో ముందుకెళ్తే లాభాలను అందుకోవడం మరింత సులభం. అధిక రాబడులు వస్తాయని మోసపూరిత స్కీముల్లో పెట్టుబడులు పెట్టకండి. సొంతింటి కల సాకారమయ్యేందుకు అనువైన పెట్టుబడులను ఎంచుకోవడం ఉత్తమం.
రిటైర్మెంట్ ప్రణాళిక
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిటైర్మెంట్ ఫండ్‌ను సిద్ధం చేసుకుంటే శేష జీవితం హాయిగా గడుస్తుంది. వివిధ రిటైర్మెంట్ పథకాలను పరిశీలించవచ్చు. చిన్న వయసులోనే ఈ స్కీముల్లో చేరితే ఎక్కువ పెన్షన్లను అందుకోవచ్చు.
అత్యవసర నిధి
ఏ సమస్య ఎలా వస్తుందో చెప్పడం కష్టం. తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి అత్యవసర నిధి కావాలి. కనీసం 6 నెలల అవసరాలు తీరేలా ఉండాలిది. ఉద్యోగం, ఆదాయ మార్గా న్ని కోల్పోయినప్పుడు ఈ నిధి అండగా ఉంటుంది.