ముంబై, ఫిబ్రవరి 21 : వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, విద్యార్థి తదితర తాకట్టులేని రుణాలు పెరుగుతుండటం, క్యాపిటల్ మార్కెట్లలో ఉత్సాహంగా నడుస్తున్న ఊహాజనిత డెరివేటివ్స్ ట్రేడింగ్‌లు ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఎకానమీతో అవకాశాలూ.. ఇబ్బందులూ రెండూ ఉన్నాయన్నారు.
శుక్రవారం ఇక్కడ సూక్ష్మ ఆర్థిక, బ్యాంకింగ్, ఫైనాన్స్ అంశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కోజీకోడ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వల్పకాలిక లాభాలపై ఉత్సుకత.. వ్యక్తుల్లో దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కనుమరుగయ్యేలా చేస్తున్నదన్నారు. అందుకే ఆర్థిక సంస్థలు రుణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని, కస్టమర్లకూ ఆర్థికపరమైన విషయాల్లో ఉన్న రిస్కులను తెలియజేసి.. వారిలో అవగాహనను పెంచాలని సూచించారు. మోసాల నుంచి వినియోగదారులను రక్షించడంలో ఆర్థిక అక్షరాస్యతే కీలకమన్నారు.