Credit Card Spending | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నెలలో రూ.1.78 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అంత పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు నమోదు కావడం ఇదే ఆల్ టైం రికార్డు. సెప్టెంబర్‌లో రూ.1.43 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25.35 శాతం గ్రోత్ రికార్డైంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర ముఖ్య వస్తువులు కొనుగోలు చేయడంతో ఈ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ట్రాన్సాక్షన్లు పెరగడం దీనికి కారణం.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం గత నెలలో రూ.57,774 కోట్ల విలువైన లావాదేవీలు పీఓఎస్ చెల్లింపులు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై జరుగుతున్న కొనుగోళ్ల చెల్లింపులు రూ.1,20,794 కోట్లు. అందులోనూ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలు మొదటి స్థానంలో నిలిచాయి. సెప్టెంబర్‌లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై రూ.38,662 కోట్ల లావాదేవీలు జరిగితే గత నెలలో రూ.45,173 కోట్లకు దూసుకెళ్లాయి.
ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో రూ.34,158 కోట్ల చెల్లింపులు జరిగితే, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.21,729 కోట్ల పేమెంట్స్ జరిగాయి. ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్స్ రూ.24,966 కోట్ల (సెప్టెంబర్) నుంచి రూ.35,406 కోట్లకు పుంజుకున్నాయి. దేశీయ క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలు గత నెలలో 17 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయగా, మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 9.48 కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.91 కోట్లకు పెరిగితే ఎస్బీఐ కార్డ్స్ 1.87 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.6 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు 1.3 కోట్లకు చేరాయి.