న్యూఢిల్లీ, అక్టోబర్ 14: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. గడిచిన నెల రోజుల్లో 4 లక్షల బుకింగ్లు రాగా, 2.5 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో అమ్మకాలు జరపడం ఇదే తొలిసారని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మారుతి తన కార్ల ధరలను రూ.1.30 లక్షల వరకు తగ్గించిన నేపథ్యంలో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు.
ఈ సీజన్లో అత్యధికంగా 80 వేల యూనిట్ట ఆల్టో, సెలేరియో, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో బుకింగ్లు వచ్చాయన్నారు. జీఎస్టీ తగ్గింపునకు మునుపు కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో చిన్న కార్ల వాటా 16.7 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 21.5 శాతానికి ఎగబాకింది. ఎస్-ప్రెస్సో మాడల్ రూ.1,29,600 తగ్గగా, ఆల్టో కే10 రూ.1,07,600, సెలేరియో రూ.94,100, వ్యాగన్-ఆర్ రూ.79, 600, ఇగ్నిస్ రూ.71,300 వరకు ధరలు తగ్గాయి.