న్యూయార్క్, సెప్టెంబర్ 18: అందరూ అనుకున్నట్లే అగ్రరాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి, నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను అర శాతం తగ్గించింది.
2020 తర్వాత వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో పాలసీ రేటు 5.25 శాతం నుంచి 5.50 శాతం స్థాయిలో ఉన్నది. కాగా, డిసెంబర్లోనూ మరో అర శాతం కోతకు అవకాశాలుం టాయన్న సంకేతాలిచ్చింది. దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి, గడిచిన రెండేండ్లుగా అమెరికాలో జీవన వ్యయాలు అధికం కావడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఫెడ్ నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఆచితూచి స్పందించాయి. అరశాతం తగ్గించాలని 11 మంది ఫెడ్ గవర్నర్లు ఓటు వేయగా, కేవలం మైకేల్ బౌమెన్ పావు శాతం తగ్గించడానికి ఓటు వేశారు. ఈ నిర్ణయంతో ఇతర దేశాల సెంట్రల్ బ్యాంక్లు కూడా వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బంగారం ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 22 డాలర్లు ఎగబాకి 2,600 డాలర్ల పైకి చేరుకున్నది.