న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని శాసించే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంచలన సంకేతాల్ని అందించింది. 2024లో 3-4 దఫాలు వడ్డీ రేట్ల తగ్గింపులు ఉంటాయంటూ సంకేతాలిచ్చింది. తాజా డిసెంబర్ పాలసీ సమీక్ష అనంతరం కీలక ఫెడ్ ఫండ్ రేట్లను 5.25-5.50 శాతం వద్ద యథాతథంగా అట్టిపెట్టింది.
ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ మీడియాతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం తమ అంచనాలకంటే వేగంగా దిగివచ్చిందని, రేట్ల పెంపు ఇక అవసరం లేదని ఫెడ్ కమిటీ భావిస్తున్నదని చెప్పారు. రెండేండ్లుగా ఫెడ్ జీరో శాతం నుంచి 5.25 శాతానికి వడ్డీ రేట్లను పెంచుతూ పోయింది. ఇందుకు అనుగుణంగా భారత్లో రిజర్వ్బ్యాంక్తో సహా పలు ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్లు ఫెడ్ బాటనే అనుసరించాయి. ఫెడ్ వైఖరి మారడంతో రిజర్వ్ బ్యాంక్ రేపో రేటును కొత్త ఏడాదిలో తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనాల్ని వెల్లడించారు.
2024 మార్చిలో తొలి తగ్గింపు
19 మంది సభ్యులుగల ఫెడ్ కమిటీలో మెజారిటీ సభ్యులు వచ్చే ఏడాది పావు శాతం చొప్పున మూడు కోతలు (0.75 శాతం) ఉంటాయని అంచనా వేశారు. మరికొంతమంది 4 కోతల్ని సూచించారు. దీంతో 2024లో 4.6 శాతానికి, 2025లో 3.6 శాతానికి ఫెడ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. 2024 మార్చి పాలసీ సమీక్షలో తొలుత 0.25 శాతం తగ్గింపు ఉంటుందని అంచనా. తాజా ఫెడ్ ప్రకటన అనంతరం ఈక్విటీలు, బాండ్లు, బంగారం కలిసికట్టుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ర్యాలీ జరిపాయి.