FATF | న్యూఢిల్లీ, ఆగస్టు 9: ‘మీ దేశంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలకు ఆస్కారమున్నది. బ్యాంకింగ్ లావాదేవీలపై ఓ కన్నేయండి. రాజకీయ, అధికార యంత్రాంగాల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయనిపిస్తున్నది’ అంటూ అంతర్జాతీయ యాంటీ-మనీ లాండరింగ్ వాచ్డాగ్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) భారత్‌ను గట్టిగా హెచ్చరించిందని సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వాళ్లవాళ్ల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై నిఘా పెట్టాలని ఎఫ్ఏటీఎఫ్ మోదీ సర్కారుకు సూచించింది.
రాజకీయ నేతల ఆర్థిక వ్యవహారాలను లోతుగా పరిశీలించాలని తమ సమీక్ష సిఫార్సుల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ కేంద్రానికి సలహా ఇచ్చినట్టు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, లంచం, అవినీతికి వీలున్నప్పుడు రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారికి సన్నిహితంగా ఉండేవారి బ్యాంక్ ఖాతాలపై నజర్ పెట్టాల్సిందేనని అంతర్జాతీయ నిబంధనలు చెప్తున్నాయని ఎఫ్ఏటీఎఫ్ గుర్తుచేస్తున్నది. ఆయా ఖాతాల్లో ఉన్న నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆరా తీస్తూనే.. వారు, వాళ్లకు సంబంధించినవారు ఏమైనా కొత్త ఖాతాలను తెరిచారా? అన్న కోణంలో సీనియర్ బ్యాంక్ మేనేజర్ల నుంచి సమాచారం రాబాట్టాలని కూడా ఎఫ్ఏటీఎఫ్ చెప్పినట్టు తెలుస్తున్నది. మొత్తంగా బ్యాంకింగ్ లావాదేవీలపై పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరమైతే ఉన్నదని ఈ గ్లోబల్ వాచ్డాగ్ భారత్‌కు స్పష్టం చేసింది.
దేశంలో ప్రస్తుతమున్న మనీ లాండరింగ్ నిరోధక చట్టాలను సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎఫ్ఏటీఎఫ్ ఇప్పుడున్న చట్టాలను, అధికారాలను, వాటిలోని లోటుపాట్లను సమీక్షిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ మేరకు తుది నివేదిక వస్తే చట్టాల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే పార్లమెంట్లో ఈ కొత్త చట్టాల సంకేతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కఠిన బ్యాంకింగ్ నిబంధనలు, పరవేక్షణలోకి దేశంలోని రాజకీయ నాయకులను తీసుకురావడం తమ ఉద్దేశమేమీ కాదన్న మోదీ.. చట్టాల సవరణకు ముందు ఎఫ్ఏటీఎఫ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. మరోవైపు దేశంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టాల అమలుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న సంగతి విదితమే. అయితే మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కేసుల విచారణను మరింత వేగవంతం చేసేలా చట్టాలుండాలన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
భారతీయ మనీ లాండరింగ్ నిరోధక వ్యవస్థల్ని గత ఏడాది నుంచి ఎఫ్ఏటీఎఫ్ సమీక్షిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో దాన్నుంచి ఈ తరహా హెచ్చరికలు రావడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఏదో పెద్ద కుంభకోణం జరిగిందా? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి మరి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఎక్కడో భారీ స్థాయిలోనే అక్రమాలను ఎఫ్ఏటీఎఫ్ గుర్తించి ఉంటుందని, అందుకే ఈ ముందస్తు సంకేతాలన్న గుసగుసలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పెద్దల్లో నడుస్తున్నట్టూ తెలుస్తున్నది. ఇక తమ సమీక్షపై ఎఫ్ఏటీఎఫ్ త్వరలో భారత్‌కు నివేదిక ఇవ్వనున్నది. దీంతో ఇది వచ్చాక పెను ప్రకంపనలకు అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయిప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్ఏటీఎఫ్ తాజా సూచనలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ప్రవేశపెట్టారు. ఇకపై ఒక్కో బ్యాంక్ ఖాతాకు నలుగురు నామినీలు కావాలన్న నిబంధనను ఇందులో తీసుకువచ్చారు. ప్రస్తుతం ఒక్క నామినీతో ఖాతాల్ని తెరిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే డైరెక్టర్‌షిప్‌ల కోసం ‘సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్’ను పునర్నిర్వచిస్తూ దానికున్న పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. సహకార బ్యాంకులకు సంబంధించీ కొన్ని మార్పులు తెస్తున్నారు. ఇక చట్టబద్ధ ఆడిటర్లకు చెల్లింపుల విషయంలో బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని కూడా మోదీ సర్కారు నిర్ణయించింది.
కాగా, రెగ్యులేటరీ సమ్మతి కోసం బ్యాంకుల రిపోర్టింగ్ రోజులనూ ప్రతి నెలా రెండో, నాల్గో శుక్రవారాలకు బదులుగా 15, నెలాఖరు తేదీల్లోకి మార్చుతున్నారు. ఆర్బీఐ చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, ఎస్బీఐ చట్టం 1955, బ్యాంకింగ్ సంస్థల చట్టాలు 1970, 1980ల్లో సవరణల కోసం తెచ్చిన ఈ బిల్లుకు గత శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. బ్యాంకుల్లో మెరుగైన పాలనాపరమైన అంశాల కోసం, మదుపరులు-ఖాతాదారుల ప్రయోజనార్థం ఈ మార్పులు తెస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.