బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Aug 15, 2020 , 01:57:50

వరుసగా ఐదో నెల తగ్గిన ఎగుమతులు దిగుమతులు

వరుసగా ఐదో నెల తగ్గిన ఎగుమతులు దిగుమతులు

న్యూఢిల్లీ: ఎగుమతులు వరుసగా ఐదో నెలో జూలైలోనూ 10 శాతం  తగ్గి 23.64 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. పెట్రోలియం, లెదర్‌, జెమ్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ పడిపోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఇదే సమయంలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 28.4 శాతం తగ్గి 28.47 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 4.83 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఏడాది క్రితం ఇది 13.43 బిలియన్‌ డాలర్లు. కరోనా వైరస్‌ దెబ్బకు ఏప్రిల్‌లో 60 శాతం పడిపోయిన ఎగుమతులు, ఆ తర్వాతి నెలలో 36 శాతం, జూన్‌లో 12 శాతం వరకు పడిపోయాయి. గత నెల విషయానికి వస్తే చమురు దిగుమతులు 32 శాతం తగ్గి 6.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమవడంతో వాణిజ్య లోటు గణనీయంగా తగ్గింది. కానీ పసిడి దిగుమతులు 4.17 శాతం పెరిగి 1.8 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై మధ్యకాలంలో ఎగుమతులు 30 శాతం తగ్గి 74.96 బిలియన్‌ డాలర్లకు, దిగుమతులు 47 శాతం తగ్గి 88.91 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీంతో లోటు 13.95 బిలియన్‌ డాలర్లుగా  నమోదైంది.


logo