హైదరాబాద్, జూలై 17: అంతర్జాతీయ హెల్త్‌కేర్ సేవల సంస్థ సనోఫి ఇండియా..హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌ను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆరేండ్లలో 400 మిలియన్ యూరోల(రూ.3,600 కోట్లు) నిధులతో ఈ సెంటర్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మడేలిన్ రోచ్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంటర్ అంతర్జాతీయ హబ్‌లలో ఇదే అతిపెద్దదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విస్తరణతో కొత్తగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో వెయ్యి మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నూతన పెట్టుబడులను కొత్తగా కంపెనీలను కొనుగోలు చేయడానికి, నూతన ఆవిష్కరణలు జరిపేందుకు వినియోగించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో తెలంగాణ ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతున్నదని, హైదరాబాద్‌లో సనోఫి జీసీసీ సెంటర్‌ను విస్తరించడం ఇదొక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో 50 శాతం మంది పీహెచ్‌డీలు, ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్‌లో మాస్టర్ చేసిన వారు ఉన్నారు. అలాగే 10 శాతం మంది ఫ్రెషర్లు కాగా, 20 శాతం మంది టెక్నాలజీ నిపుణులు.