హైదరాబాద్, మే 9: రాష్ర్టానికి చెందిన విద్యుత్ ఆటోల తయారీ సంస్థ ‘ఈటో’ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. దేశీయంగా ఈ ఆటోలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది 10 వేల యూనిట్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యం గా పెట్టుకున్నది. ఇందుకోసం జడ్చర్ల వద్ద ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని రెండింతలు పెంచడానికి రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు ఈటో మేనేజింగ్ డైరెక్టర్ పవన్ చావలి తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,500 యూనిట్ల ఆటోలను విక్రయించిన సంస్థ..వీటిలో హైదరాబాద్ రోడ్లపైన 300 వరకు వాహనాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్లో నెలకు 300 నుంచి 400 వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.
వచ్చే ఏడాదిలోగా మరో రెండు వాహనాలను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంట్లో ఏడు సీట్ల కెపాసిటీ కలిగిన ఈ-ఆటోతోపాటు మినీ బస్సు కూడా ఉన్నది. ప్రస్తుతం సంస్థ రూ.3.5 లక్షలు మొదలుకొని రూ.4 లక్షల లోపు ధర కలిగిన ఆటోలను దేశీయంగా విక్రయిస్తున్నది. మరోవైపు, మహిళా సాధికారిత లక్ష్యంగా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా మహిళలకు ఈ-ఆటోలు నడపడంపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. త్వరలో వీరు డ్రైవింగ్ లైసెన్స్ పొంది హైదరాబాద్‌లో ఈ ఆటోలు నడపనున్నారు. ఇప్పటికే ఇలాంటి కార్యక్రమంగా గుజరాత్లో చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈవీ పాలసీ భేషుగ్గావున్నదని పవన్ వెల్లడించారు. ఇప్పటికే ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పుతున్నాయని, ముఖ్యంగా ప్రత్యేక క్లస్టర్లో వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు.