SUV Cars | ఆటోమొబైల్ కంపెనీలు 2022లో 37.93 లక్షల కార్లు విక్రయించాయి. గతేడాది కార్ల సేల్స్.. 2018 నాటి రికార్డులను అధిగమించింది. నాలుగేండ్ల క్రితం.. 2018లో 33.8 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2018తో పోలిస్తే 2022లో 12.21 శాతం, 2021తో పోలిస్తే 23.10 శాతానికి పైగా యూనిట్ల ఎస్యూవీ కార్లు విక్రయించాయి ఆటోమొబైల్ సంస్థలు. మొత్తం కార్లలో ఎస్‌యూవీల వాటా 45.30 శాతం. అంటే దాదాపు ప్రతి రెండో కస్టమర్.. ఎస్యూవీ కారు కొనుగోలు చేశాడని తెలుస్తున్నది.
2021లో కరోనా మహమ్మారితోపాటు సెమీ కండక్టర్ల కొరత వల్ల కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు గిరాకీకి అనుగుణంగా కార్లు సరఫరా చేయలేకపోయాయి. గతేడాది ఆ సమస్య నుంచి ఆటోమొబైల్ సంస్థలు బయట పడ్డాయి. కొవిడ్-19 సంబంధ ఆంక్షల నుంచి అన్ని రకాల ఇండస్ట్రీయల్ సెక్టార్లకు స్వేచ్ఛ లభించింది. 2022లో సర్వీస్ సెక్టార్ పూర్తిగా సేవలు ప్రారంభించింది. ఉపాధి కల్పనతోపాటు ఆదాయం పెరగడంతో కార్ల విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
కార్ల సేల్స్‌తో పోలిస్తే డిసెంబర్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ 27.88 శాతం తగ్గి 59,554 యూనిట్లకు చేరాయి. గత నవంబర్‌లో 76,162 ఈ-బైక్‌లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య సుమారు ఐదు లక్షల ఈ-బైక్‌లు సేల్ అయ్యాయి. వచ్చే మార్చి నాటికి పది లక్షల ఈ-టూ వీలర్స్ విక్రయించాలని నీతి ఆయోగ్ లక్ష్యాలు నిర్దేశించింది. కానీ నిర్ధిష్ట కాలంలో అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 మార్చి నాటికి) లో 10 లక్షల ఈ-టూ-వీలర్స్ విక్రయించాల్సి ఉండగా, 20-30 శాతం సేల్స్ తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయం తగ్గడానికి కూడా ఒక కారణం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ-టూ వీలర్స్ తయారీ చేస్తున్న డజన్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్ల సబ్సిడీ నిలిపేసింది. గత రెండు నెలలుగా ఈ-బైక్స్ సేల్స్ తగ్గడానికి ఇదే కారణం అని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డైరెక్టర్ జనరల్ సొహిందర్ గిల్ పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల తయారీ ఖర్చులో 40 శాతం వరకు గరిష్టంగా కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఈ-టూ వీలర్స్‌కు కిలోవాట్ అవర్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీ లభిస్తుంది. గృహోపకరణాల మాదిరిగా వాడే వస్తువులపై సబ్సిడీ 40 శాతానికి పరిమితం చేసింది. వాహనాల ధరలోనే సబ్సిడీ కూడా ఇమిడి ఉంటుంది. ఈ-టూ వీలర్స్ తయారీ సంస్థలు తాము బైక్స్, స్కూటర్లు తయారు చేసిన పత్రాలు సమర్పించిన 45-90 రోజుల్లో సబ్సిడీ చెల్లిస్తుంది.