హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రవేశపెడుతున్న సబ్సిడీలకు ఈవీ కంపెనీలు సహకరించాలని, ఆయా సంస్థల ప్రతినిధులే చొరవ తీసుకొని పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు, డీలర్లతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంసరణలు తీసుకొచ్చిందని, ఢిల్లీ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈవీ పాలసీ తీసుకొచ్చామని, ఇప్పటి వరకు 1,59,304 వాహనాలకు రూ. 806.35 కోట్ల రాయితీలు ఇచ్చామన్నారు. జనవరిలో నిర్వహించనున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమాల్లో విసృ్తత అవగాహన కల్పించాలని, షోరూం లు, పెట్రోల్ బంకులతోపాటు ఇతర ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు.