హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు దూసుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ పరిశ్రమలు ఏడున్నరేండ్ల్లలో 6,700 పైచిలుకు ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శనం. వీటిద్వారా 1.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015 జనవరి నుంచి టీఎస్ ఐ-పాస్ అమల్లోకొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచి డిసెంబర్, 2021వరకు దీని ద్వారా మొత్తం 26 రంగాలకు చెందిన 18,631 పరిశ్రమలకు అనుమతులు జారీ అయ్యాయి. ఇందులో 13,743 పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 969 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 897 పరిశ్రమలు నిర్మాణదశలో ఉన్నాయి. మిగిలిన 3,022 పరిశ్రమలు ఇంకా నిర్మాణపనులు చేపట్టాల్సివుంది. ఈ మొత్తం పరిశ్రమల ద్వారా 16,28,728 మందికి ఉద్యోగాలు లభించను న్నాయి. ఈ పరిశ్రమల్లో అత్యధికంగా ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించినవి ఉండడం విశేషం. మొత్తం 18,631పరిశ్రమలకుగాను ఇంజినీరింగ్ రంగంలో 3511, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో 3264పరిశ్రమలు ఉన్నాయి. ఈ రెండు రంగాల ద్వారా మొత్తం 1,31, 775మందికి ఉద్యోగావకాశాలు కలుగుతున్నాయి. వివిధ రకాల ఇనుప వస్తువుల తయారీ, ఫ్యాబ్రికేషన్, వెల్డింగ్, యంత్ర పరికరాలు, వివిధ పనిముట్లు తదితర పరిశ్రమలు ఇందులో ఉన్నాయి. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. అత్యధికంగా ఏర్పాటైన పరిశ్రమల్లో కోల్డ్ స్టోరేజీలు- 2,407, ఫ్లైయాష్ బ్రిక్స్-1,765, గ్రానైట్, స్టోన్ క్రషింగ్- 1,409, ప్లాస్టిక్, రబ్బర్-1,238, ఫార్మా, కెమికల్స్-1,214 పరిశ్రమలు ఉన్నాయి.
మేడ్చల్‌లో అత్యధికంగా 4,060 పరిశ్రమలు..
జిల్లాలవారీగా చూస్తే, అత్యధికంగా పరిశ్రమలు ఏర్పాటవుతున్న జిల్లాల్లో మేడ్చల్ జిల్లా 4,060 పరిశ్రమలతో అగ్రస్థానంలో ఉంది. 1,482 పరిశ్రమలతో సంగారెడ్డి, 1,334పరిశ్రమలతో రంగారెడ్డి జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 1,307 పరిశ్రమలతో కరీంనగర్ నాల్గవ స్థానంలో, 929 పరిశ్రమలతో జగిత్యాల ఐదో స్థానంలో, 741 పరిశ్రమలతో ఖమ్మం ఆరో స్థానంలో నిలిచాయి. నారాయణపేట్ జిల్లాలో 44, హైదరాబాద్ జిల్లాలో 52, ములుగులో 59, వనపర్తిలో 78పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.