హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 19న సంగారెడ్డి ఈపీఎఫ్‌వో రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎంవీబీఆర్‌వై) ఉత్సవ్’ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఈపీఎఫ్‌వో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో జరుగనున్న ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
ఉపాధి, సామాజిక భద్రత వికసిత్ భారత్‌కు ఏ విధంగా దోహదపడుతాయో అనే విషయంపై మోదీ ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. హైదరాబాద్ ఐఐటీలో జరిగే ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, పాశమైలారంలోని అపిటోరియో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ రిసెర్చ్ సెంటర్-2 ఆడిటోరియంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకానున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఈపీఎఫ్‌వో అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్టు తెలిపారు.