EPFO | అధిక పెన్షన్ ఆప్షన్ కోసం సిబ్బంది వేతనాల వివరాలు అప్లోడ్ చేయడానికి యాజమాన్యాలకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) గడువు పొడిగించింది. డిసెంబర్ 31 వరకూ యాజమాన్యాలు తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో అధిక ఆప్షన్ కోసం దరఖాస్తు చేసిన వారి వేతనాల వివరాలు అందజేయాల్సి ఉంది. ఈ నెలాఖరుతో గడువు ముగియాల్సి ఉంది. కానీ యాజమాన్యాల సంఘం నుంచి అభ్యర్థన మేరకు ఈపీఎఫ్ఓ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నదని కార్మికశాఖ తెలిపింది.
ఈ నెల 29 వరకూ ‘వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్ / జాయింట్ ఆప్షన్` విషయమై యాజమాన్యాల వద్ద 5.52 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో గడువు పొడిగించామని కేంద్ర కార్మికశాఖ వెల్లడించింది. గతేడాది నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉద్యోగుల నుంచి అధిక పెన్షన్ ఆప్షన్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది ఈపీఎఫ్ఓ. గత ఫిబ్రవరి 26 నుంచి మే మూడు వరకూ కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ.. జూన్ 26 వరకూ.. చివరిగా జూలై 11 వరకూ పొడిగించింది. అధిక పెన్షన్ జాయింట్ ఆప్షన్ కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.