మరోసారి వడ్డింపు
- ఈఎంఐలు మరింత భారం
- అరశాతం రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. ఐదు వారాల్లో రెండో పెంపు
- సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతం..జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం
న్యూఢిల్లీ, జూన్ 8: ఐదు వారాలు గడవకముందే సామాన్యుడిపై రిజర్వ్‌బ్యాంక్ మరింత భారం మోపింది. గృహ, ఆటో, ఇతర రుణాలపై నెలసరి వాయిదాలు (ఈఎంఐలు) ఇంకా పెరగనున్నాయి. బుధవారం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) పెంచింది. నెలరోజుల క్రితమే 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ కమిటీ జూన్ సమీక్షా సమావేశాల అనంతరం మరో 50 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు 4.90 శాతానికి చేరుతుంది.
వాణిజ్య బ్యాంక్‌లు తన వద్ద ఉంచే స్వల్పకాలిక నిధులపై చెల్లించే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. రిజర్వ్బ్యాంకే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నందున, బ్యాంక్‌లు సహజంగానే రుణ రేట్లను, డిపాజిట్ రేట్లను పెంచుతాయి. రెపో రేటు పెరుగుదలకు అనుగుణంగానే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లను అంతేస్థాయిలో 4.65 శాతం నుంచి 5.15 శాతానికి చేరుస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు.
గడిచిన మే4న రిజర్వ్‌బ్యాంక్ హఠాత్తుగా జరిపిన సమీక్షలో 40 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా 11 సమీక్షలో రెపో రేటును యథాతథంగా 4 శాతం కనిష్టస్థాయి వద్ద అట్టిపెట్టిన ఆర్బీఐ వెంటవెంటనే రెండు దఫాలు రేట్లను పెంచింది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని పునరుద్ధరించే క్రమంలో 2019 ఫిబ్రవరి నుంచి రేట్లను పలు సమీక్షలో 250 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కరోనా సంక్షోభం తలెత్తిన 2020 మార్చి-2020 మే మధ్యకాలంలోనే 115 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగింది.

ద్రవ్యోల్బణం అంచనాలు పైపైకి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ద్రవ్యోల్బణం అంచనాల్ని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భారీగా పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ అంచనా 5.7 శాతంకాగా, ఇప్పుడు దీనిని 6.7 శాతానికి పెంచింది. వాస్తవానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంతకంటే అధికంగా 7.79 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించకుండా చూడాలన్న నిర్దేశంతో పనిచేస్తున్న ఆర్బీఐ తమ సహనస్థాయిని ఇది మించిపోయినందున రేట్ల పెంపునకు దిగింది. ఈ ఏడాది డిసెంబర్ వరకూ ద్రవ్యోల్బణం తమ సహనస్థాయి 6 శాతాన్ని మించే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శక్తికాంత్ దాస్ తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతున్నందున, తాము ద్రవ్యోల్బణం అంచనాల్ని అధికం చేశామన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని రిజర్వ్‌బ్యాంక్ 7.2 శాతం వద్ద యథాతథంగా అట్టిపెట్టింది.
ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపుతో సహా తాము తీసుకోబోయే నిర్ణయాలు పరిస్థితుల మార్పునకు అనుగుణంగా ఉంటాయ్. కొవిడ్ ముందస్తుస్థాయికంటే వడ్డీ రేట్లు దిగువనే ఉన్నాయి. ఉత్పాదక అవసరాలకు వ్యవస్థలో తగినంత లిక్విడిటీని అందుబాటులో ఉంచుతాం. ఇప్పుడైతే మా దృష్టంతా ద్రవ్యోల్బణం మీదే. ద్రవ్యోల్బణం తగ్గి తీరాలి. ఆర్థిక వ్యవస్థ రికవరీ కొనసాగాలి. మా చర్యల లక్ష్యమిదే.
– మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
ఎవరెవరు ఏమన్నారు?
‘రెపో రేటు పెంపు ఊహించినదే. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నడుమ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధిరేటు పెంపును దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ముందుకు సాగుతున్నది’
-చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
‘ద్రవ్యోల్బణంపైనేగాక, వృద్ధిరేటునూ దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తున్నది. నిజానికి ఇప్పటికీ కీలక వడ్డీరేట్లు కరోనాకు ముందున్న స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి’
-దీపక్ సూద్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి
‘ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ ద్రవ్యసమీక్షల్ని జరుపుతున్నది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ వృద్ధి అంచనాను యథాతథంగా ఉంచడం ప్రోత్సాహకరం’
-శుభ్రాకాంత్ పాండా, ఫిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడు
‘వడ్డీరేట్ల పెంపు వ్యాపారావకాశాల్ని దెబ్బ తీస్తుంది. ఇప్పటికే అన్ని రంగాల్లో ముడి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. వడ్డీరేట్లు మరింత పెరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందే’
-ప్రదీప్ ముల్తానీ, పీహెచ్డీ చాంబర్ అధ్యక్షుడు
‘ఆర్బీఐ నిర్ణయంతో కన్జ్యూమర్, గృహ రుణాలు భారం అవుతాయి. నిర్మాణ రంగానికీ దెబ్బే. అయితే సహకార బ్యాంకుల్లో గృహ రుణాల పరిమితిని రెట్టింపు చేయడం కలిసొచ్చే అంశం’
-హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు
‘కరోనాకు ముందున్న స్థాయిని మించి వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రెండు ద్రవ్యసమీక్షల్లో మరో 35, 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటు పెరిగే వీలున్నది’
-అదితి నాయర్, ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త
‘ఆర్బీఐ ద్రవ్య విధానంతో, ప్రభుత్వం ఆర్థిక విధానాలతో ద్రవ్యోల్బణం కట్టడి, జీడీపీ ప్రగతికి చర్యలు తీసుకుంటున్నాయి. రూపాయిని బలపర్చే చర్యలూ కొనసాగుతున్నాయి’
-అజయ్ సేథ్, డీఈఏ కార్యదర్శి
స్థానిక పోలీసులకు చెప్పండి
ఊరు.. పేరు తెలియని డిజిటల్ లెండింగ్ యాప్స్ నుంచి అప్పులు తీసుకునేవారు ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీసుల్నే సంప్రదించాలని ఆర్బీఐ సూచించింది. నిబంధనల ప్రకారం నమోదైన సంస్థలపైనే తాము ఎటువంటి చర్యలనైనా తీసుకోగలమని, అలా కాకుండా ఇతర సంస్థల్ని తాము ఏమీ చేయలేమని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. లెండింగ్ యాప్స్ వేధింపులు.. ఇటీవల పలువురి ఆత్మహత్యలకు దారితీసిన నేపథ్యంలో పైవిధంగా దాస్ స్పష్టత ఇచ్చారు.
ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు
- రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 4.9 శాతానికి రివర్స్ రెపో రేటు యథాతథంగా 3.35 శాతం
- 4.5 శాతం వద్దనే నగదు నిల్వల నిష్పత్తి
- ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధిరేటుకు మద్దతుగానే ఇక ద్రవ్య విధానం
- వంటనూనె ధరలపై అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం
- వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెరగనున్న గ్రామీణ వినియోగం
- ఆగస్టు 2-4 తేదీల్లో తదుపరి ద్రవ్యసమీక్ష
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- emis
- MPC
- Reserve Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

