Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఈఓ ఎలన్ మస్క్‌పై ఆటో పైలట్ టీం సభ్యుడు భారత సంతతి అమెరికన్ అశోక్ ఎల్లుస్వామి ప్రశంసలు కురిపించారు. ఈ బృందంలో చేరిన తొలి వ్యక్తిగా అశోక్ ఎల్లుస్వామి.. కృత్రిమ మేధ, ఆటో పైలట్ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఏఐ, ఆటో పైలట్ విభాగాలపై ప్రయోగాలు ప్రారంభిస్తున్నప్పుడు ఎలన్ మస్క్ ఆలోచనలు అసాధ్యమని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారని అశోక్ ఎల్లుస్వామి గుర్తు చేసుకున్నారు. అయినా మస్క్ నమ్మకంగా తమ టీంను ముందుకు నడిపించారని చెప్పారు.
2014లో ఆటో పైలట్ విభాగాన్ని ఓ చిన్న కంప్యూటర్‌తో ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కంప్యూటర్ 384 కేబీ మెమొరీ కెపాసిటీ గల చిన్న డెస్క్ టాప్ కంప్యూటర్ అని అశోక్ ఎల్లుస్వామి తెలిపారు. లేక్ కీపింగ్, లేన్ చార్జింగ్ వంటి అంశాలను అమలు చేయాలని మస్క్ చేసిన సూచనలను ఇంజినీరింగ్ టీం విశ్వసించలేదన్నారు. అయినప్పటికీ విశ్వాసం సడలకుండా లక్ష్యం వైపు టీంను నడిపించి, 2015లో తొలి ఆటో పైలట్ సిస్టమ్ తెచ్చారని అశోక్ గుర్తు చేశారు.
సాటిలేని దూరదృష్టితో పని చేసే ఎలన్ మస్క్ పలు సవాళ్లను ఎదుర్కొని టెస్లాను అగ్రగామిగా నిలిపారని, మున్ముందు పూర్తిగా ఆటోమేటిక్ కార్లు, హోమ్ రోబోట్స్ జీవితంలో భాగం అవుతాయని అశోక్ ఎల్లుస్వామి ట్వీట్ చేశారు. తొలుత ఏఐ,ఆటో పైలట్ టీంలో సభ్యుడిగా ఉన్న అశోక్ .. ప్రస్తుతం అన్ని ఏఐ, ఆటో పైలట్ సాఫ్ట్ వేర్ లకు సారధ్యం వహించే స్థాయికి చేరుకున్నారని, ఈ టీం సభ్యుల్లేకపోతే టెస్లా కూడా సాధారణ కార్ల కంపెనీగానే ఉండేదేమోనని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ, ఆటో పైలట్ సాఫ్ట్ వేర్ లో టెస్లా సాధించిన విజయానికి అశోక్ ఎల్లుస్వామి బృందానికి ఎలన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపారు.