న్యూయార్క్, ఏప్రిల్ 14: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 9 శాతం వాటాను కొన్న మస్క్ అమెరికా కంపెనీ అయిన ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. తాజాగా షేరుకు 54.20 డాలర్లతో మిగిలిన వాటాను కొనడానికి నేరుగా ఆఫర్ ప్రకటించారు. ఈ ధర వద్ద ట్విట్టర్ కంపెనీకి 41 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.12 లక్షల కోట్లు) విలువను మస్క్ ఆపాదించారు. ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డులో చేరేందుకు నిరాకరించిన కొద్దిరోజుల్లోనే మస్క్ తాజా నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. గురువారం ఈ షేరు 48 డాలర్లకు పెరిగింది. మస్క్ తర్వాత ట్విట్టర్లో అత్యధిక వాటాలు (8.8శాతం) వ్యాన్‌గార్డ్ గ్రూప్‌నకు చెందిన మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌ల వద్ద ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మోర్గాన్‌స్టాన్లీ వద్ద 8.4 శాతం, బ్లాక్‌రాక్ వద్ద 6.5 శాతం, స్టేట్‌స్ట్రీట్ వద్ద 4.5 శాతం చొప్పున వాటా ఉంది. ట్విట్టర్‌ను 2006లో స్థాపించిన నలుగురిలో ఒకరైన మాజీ సీఈవో జాక్ డార్సే చేతిలో 2.3 శాతం వాటా ఉంది. కంపెనీకి ప్రస్తుతం భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా ఉన్నారు.
8 కోట్ల మంది ఫాలోవర్లు:
ఈ ఏడాది జనవరి 31 నుంచి దాదాపు ప్రతీ రోజూ ట్విట్టర్ షేర్లను కొద్దికొద్దిగా కొంటున్నట్టు ఈ బిలియనీర్ ఎక్సేంజ్‌లకు తెలిపారు. ఆ వాటా 9 శాతానికి చేరిన తర్వాత ట్విట్టర్ వెంటనే ఎలాన్ మస్క్‌కు తమ డైరెక్టర్ల బోర్డ్‌లో సీటును ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ కంపెనీలో ఆయన వాటా 14.9 శాతానికి మించకూడదన్న షరతు పెట్టింది. దానిని మస్క్ తిరస్కరించారు. 8.1 కోట్ల ట్విట్టర్ ఫాలోవర్లతో ఆ ప్లాట్ఫామ్లో పాప్స్టార్స్ అరియానా గ్రాండే, లేడీ గాగా తర్వాత అత్యంత ప్రాచుర్యం ఉన్న సెలబ్రిటీగా మస్క్ పేరొందారు.