న్యూఢిల్లీ, మార్చి 20: అమెరికాకు చెందిన ఔషధ రంగ దిగ్గజం ఎలీ లిల్లి.. భారతీయ మార్కెట్లోకి డయాబెటిస్, బరువు తగ్గే ఔషధాన్ని తీసుకొచ్చింది. దేశీయ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు లభించడంతో ‘మౌంజారో’ పేరిట ఈ డయాబెటిస్, వెయిట్-లాస్ డ్రగ్‌ను పరిచయం చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం 5 ఎంజీ వయల్ ధర రూ.4,375గా, 2.5 ఎంజీ వయల్ ధర రూ.3,500గా ఉంటుంది.
కాగా, లిల్లి తయారు చేస్తున్న ఈ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తునే డిమాండ్ ఉన్నది. ఇక మౌంజారో రసాయనిక నామం టిర్జెపటైడ్. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల్లో ఇప్పటికే దీన్ని అమ్ముతున్నారు. బ్రిటన్, ఐరోపా దేశాల్లో మౌంజారో పేరుతోనే విక్రయిస్తుండగా, అమెరికాలో మాత్రం జెప్‌బౌండ్ పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే భారత్‌కూ దీన్ని తేవాలని లిల్లి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు మార్గం సుగమమైంది. కాగా, భారత్‌లో 10 కోట్లకుపైగా జనాభా టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. వీరందరికీ మౌంజారో గొప్ప ఊరట కాగలదన్న ఆశాభావాన్ని లిల్లి ఇండియా అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ విన్సెలో టక్కర్ వ్యక్తం చేశారు. మరోవైపు 2030 నాటికి ఈ ఔషధం అమ్మకాలు 150 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు మార్కెట్ విశ్లేషకుల నుంచి వినిపిస్తుండటం గమనార్హం.