Electrolux Layoffs | ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండటంతో పలు కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఆ జాబితాలో స్వీడన్ గృహోపకరణాల తయారీ సంస్థ ఎలక్ట్రోలక్స్ వచ్చి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల మందిని తొలగించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మూడో త్రైమాసికంలో భారీ నష్టాలు వచ్చినందున సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్లాన్లో భాగంగా వీరిని తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఉత్తర అమెరికా బిజినెస్లో ఖర్చులను పొదుపు చేయాల్సి ఉందని ఎలక్ట్రోలక్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ ఒక వార్తాకథనం ప్రచురించింది. దీనివల్ల 3,500 – 4,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని సమాచారం. నార్త్ అమెరికాలో ఎలక్ట్రోలక్స్ భారీ నష్టాలను చవిచూసింది. డిమాండ్ తగ్గుముఖం పట్టిందని సంస్థ పేర్కొంది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల వల్ల మున్ముందు డిమాండ్ మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నది.
యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో 2023లో మార్కెట్ డిమాండ్ మరింత పతనం అవుతుందని భావిస్తున్నట్లు ఎలక్ట్రోలక్స్ సీఈవో జొనస్ శ్యాముల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది నెగెటివ్ గ్రోత్ నమోదు కావచ్చునని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో నిర్వహణ నష్టాలు 385 మిలియన్ల స్వీడన్ క్రౌన్లు.. డాలర్లలో 35.1 మిలియన్ డాలర్లు. గతేడాది నికర లాభం 1.64 బిలియన్ డాలర్లు.
ఒక్క నార్త్ అమెరికా డివిజన్లోనే సంస్థ 1.2 బిలియన్ల క్రౌన్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో 2023లో నార్త్ అమెరికా డివిజన్ పరిధిలో 4-5 బిలియన్ల కౌన్ల మేరకు పొదుపు చేయాలని నిర్ణయించింది ఎలక్ట్రోలక్స్. ప్రస్తుత త్రైమాసికంలో 1.2-1.5 బిలియన్ల క్రౌన్ల మేరకు పొదుపు చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.