హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమల నెత్తిన విద్యుత్తు బిల్లుల పిడుగు పడింది. అక్టోబర్‌దాకా రూ.10వేలు దాటని కరెంట్ బిల్లులు.. నవంబర్ నుంచి రూ.60 వేలుగా వస్తున్నాయి మరి. ఒకటో, రెండో ఇండస్ట్రీలకు కాదు.. రాష్ట్రంలోని మెజారిటీ పరిశ్రమలదీ ఇదే పరిస్థితి. దీంతో యావత్తు తెలంగాణ పారిశ్రామిక రంగం అవాక్కవుతున్నదిప్పుడు. సాఫ్ట్వేర్ మార్పు, పవర్ ఫ్యాక్టర్ అన్లాకింగ్ చేయడమే ఇందుకు కారణం. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. ఇక పరిశ్రమ నడిచినా.. నడవకపోయినా మీటర్ రీడింగ్ మాత్రం తిరుగుతూనే ఉన్నదని నిర్వాహకులు నెత్తి, నోరు కొట్టుకుంటున్న దుస్థితి. రెండు డిస్కంల పరిధిలో కేవలం ఒక్క నెలలో జారీ అయిన అదనపు విద్యుత్తు బిల్లుల మొత్తం రూ.500 కోట్లకుపైగా ఉంటుందని చెప్తున్నారు. ఇది కొనసాగితే రాష్ట్ర పారిశ్రామిక రంగం కుదేలేనని నిపుణులు హెచ్చరిస్తుండం ఇప్పుడు మిక్కిలి ఆందోళనకరంగా మారింది.
విద్యుత్తు మీటర్లలో లాగింగ్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లుంటాయి. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కరెంట్ వోల్టేజ్ కంటే తక్కువ ప్రవహించడం. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే వోల్టేజ్ కంటే ఎక్కువ ప్రవహించడం. ఈ పవర్ ఫ్యాక్టర్ 0.9-1లోపు ఉండాలి. 0.9కు తగ్గితే జరిమానాలు విధించేవారు. అయితే ఇంతకాలం మీటర్లలో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్‌ను బ్లాక్‌చేశారు. కానీ ఇప్పుడు తెరిచారు. సాఫ్ట్‌వేర్‌ను మార్చడం, పవర్ ఫ్యాక్టర్‌ను తెరువడంతో మీటర్ రీడింగ్ గిర్రున తిరుగుతున్నది. బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే కొన్నిచోట్ల మళ్లీ కెపాసిటర్లు పెట్టాలని డిస్కం అధికారులు చెప్తున్నారు. ఇందుకు లక్ష, 2 లక్షల రూపాయలదాకా ఖర్చవుతుంది. నిజానికి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కున్న లాకింగ్ వ్యవస్థను తొలగించి వినియోగించిన ప్రతి యూనిట్‌కూ బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఉత్తర్వులిచ్చింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం కెపాసిటర్లు పెట్టుకోవాలని డిస్కం అధికారులు ఉత్తర్వులిచ్చారు. కొందరు కెపాసిటర్లు పెట్టుకున్నా బిల్లులు అమాంతం పెరిగాయి.
రాష్ట్రంలో విద్యుత్తు బిల్లులు పెంచే పరిస్థితి లేదు. పెంచితే వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదమున్నది. జనం, పారిశ్రామికవేత్తలు పెంపును తీవ్రంగా వ్యతిరేకించే అవకాశమున్నది. మరోవైపు డిస్కంల పరిస్థితి బాగాలేదు. అప్పులు, వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ ఏమాత్రం సరిపోవడం లేదు. తీవ్ర ఆర్థిక లోటుతో నడుస్తున్నాయి. దీంతో ఈ నష్టాలు, లోటును పూడ్చుకునేందుకే ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలపై అదనపు భారం మోపుతున్నారని పారిశ్రామికవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నష్టాలను భర్తీచేసే కొత్త ఎత్తుగడగా దీన్ని వారంతా అభివర్ణిస్తున్నారు.
నవంబర్ నెలలో జారీచేసిన పెరిగిన బిల్లులను ఉపసంహరించాలి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల సగటు బిల్లులను నవంబర్‌లో జారీచేయాలి. పెనాల్టీలను తొలగించాలి. అధిక బిల్లులను ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, ఇండస్ట్రీ వర్గాలు భరించలేకపోతున్నాయి.
పారిశ్రామికవేత్తలకు మద్దతు లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తే ఎవరికి చెప్పుకోవాలి. కొత్త కెపాసిటర్లకు లక్ష, రెండు లక్షల రూపాయలను ఎక్కడి నుంచి తేవాలి. ప్రభుత్వం, డిస్కం అధికారులు దీనికో పరిష్కారం చూపిస్తేనే పారిశ్రామిక రంగం ముందుకెళ్తుంది.
ఒక్క నెలలోనే జారీ అయిన అధిక బిల్లులను చూసి పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. మీటర్ రీడింగ్ ఎందుకు పెరిగిందో.. ? బిల్లులెందుకు అధికంగా వచ్చాయో ..? తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయంపై ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు. టీజీఎస్పీడీసీఎల్ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే సర్కారు పెద్దలను కలిసి ఫిర్యాదుచేసేందుకూ రెడీ అవుతున్నారు. పారిశ్రామిక రంగం సమస్యల్లో ఉంది. ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి. చాలా పరిశ్రమలు 50-60శాతం ఉత్పాదకతతోనే నడుస్తున్నాయి. ఈ తరుణంలో విద్యుత్తు బిల్లుల రూపంలో భారీ ఉపద్రవం వచ్చిపడింది. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియక పారిశ్రామికవేత్తలు సతమతమవుతున్నారు. మొత్తానికి అదనపు బిల్లులను కట్టబోమని పారిశ్రామికవేత్తలంటున్నారు.