Auto Mobility Expo | న్యూఢిల్లీ, జనవరి 18: దేశీయ ఆటోమొబైల్ ఎక్స్‌పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స్‌పోలో ఈవీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయి కంపెనీలు. సోలార్‌తో నడిచే ఈవీతోపాటు ప్రీమియం ఈవీ కార్లు, కమర్షియల్ వాహనాలు, ట్రక్కులు, స్కూటర్లు, చిన్న స్థాయి కమర్షియల్ వాహనాలతో ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ కళకళలాడింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది వావే మొబిలిటీ. ఈవా పేరుతో విడుదల చేసిన ఈ కారు రూ.3.25 లక్షలు మొదలుకొని రూ.6 లక్షల గరిష్ఠ ధరతో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో విలాస్ దేశ్‌పాండే మాట్లాడుతూ..సోలార్‌తో నడిచే ఈ వాహనానికి దేశీయంగా డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు, వచ్చే ఏడాది మధ్య నుంచి కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వాహనాన్ని బుకింగ్ చేసుకున్న కస్టమర్లు ఇంచుమించు రెండేండ్లు వేచిచూడాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వాహనాలు కేవలం పుణె, బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించనున్నట్లు చెప్పారు. మూడు రకాల్లో నివా, స్టెల్లా, వెగా పేర్లతో లభించనున్న ఈ కారు ఈ నెల చివరి నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆటో..దేశీయ మార్కెట్లోకి రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానున్న వీఎఫ్ 7, వీఎఫ్ 6 మాడళ్లు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్లను తయారు చేయడానికి తమిళనాడులో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు విన్‌ఫాస్ట్ ఆసియా సీఈవో ఫామ్ సన్హా చౌ తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్‌తోపాటు కార్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ చిన్న కమర్షియల్ వాహనాలతోపాటు మూడు చక్రాల వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది మోంత్రా ఎలక్ట్రిక్. 3.5 టన్నుల సరుకును తీసుకెళ్లే ఈ ఎవియేటర్ కమర్షియల్ వాహనాన్ని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా రీచార్జికానున్న ఈ మూడు చక్రాల వాహనం వ్యక్తిగత వ్యవస్థాపకులకోసం తీర్చిదిద్దినట్లు వెల్లడించింది.
బెంగళూరుకు చెందిన ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ న్యూమరస్ మోటర్స్..దేశీయ మార్కెట్లోకి రూ.1.09 లక్షల విలువైన ఈ-స్కూటర్ డిప్లాస్ మ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సింగిల్ చార్జింగ్‌తో 140 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ గంటకు 63 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. 3 నుంచి 4 గంటలలోపే బ్యాటరీ పూర్తిస్థాయిలో రీచార్జికానున్నది. ప్రస్తుతం 14 నగరాల్లో మాత్రమే వాహనాలను విక్రయిస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి వీటి సంఖ్యను 170కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది.
విద్యుత్‌తో నడిచే కమర్షియల్ వాహన తయారీ సంస్థ ఎకా మొబిలిటీ..తాజాగా ఎలక్ట్రిక్ ట్రక్కు, ఆరుగురు కూర్చోవడానికి వీలుండే రవాణా వాహనాన్ని సైతం ఆవిష్కరించింది. ఎకా 55టీ పేరుతో పిలిచే ఈ ఎలక్ట్రిక్ హెవీ-డ్యూటీ ట్రక్కు సింగిల్ చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు, 43 వేల కిలోల లోడ్ కెపాసిటీ, ఫాస్ట్-చార్జింగ్ సదుపాయంతో తయారు చేసింది. దేశీయ ఆటోమొబైల్ రంగంపై తమకున్న కమిట్మెంట్కు ఈ నూతన వాహనాలు నిదర్శనమని, తాజాగా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.