IMF | భారత్ వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ జీడీపీ వృద్ధిరేటు 8 శాతం ఉంటుందన్న ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ అంచనా ఆయన వ్యక్తిగతం అని, తమ అంచనా కాదని పేర్కొంది. ఆయన ఐఎంఎఫ్‌లో భారత్ ప్రతినిధి మాత్రమేనని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి జులీ కొజాక్ చెప్పారు. భారత్ ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందన్న సుబ్రమణ్యన్ అంచనాలు.. ఇంతకుముందు గ్రోత్ అంచనాలకు భిన్నం అని ఆమె తెలిపారు.
గత నెల 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ మాట్లాడుతూ గత పదేండ్లుగా పని చేస్తున్న ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు వేగవంతం చేస్తే 2047 నాటికి భారత్ వృద్ధిరేటు 8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. కానీ, భారత్ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని గత జనవరిలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఐఎంఎఫ్‌లో సభ్య దేశాల ప్రతినిధులతో కూడిన ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుందని జూలీ కొజాక్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అంచనాలతో, ఐఎంఎఫ్ సిబ్బంది అంచనాలు విభిన్నంగా ఉండొచ్చునని చెప్పారు. త్వరలో భారత్ వృద్ధిరేటు అంచనాలను వెలువరిస్తాం అని తెలిపారు.