న్యూఢిల్లీ, అక్టోబర్ 26: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధుల మళ్లింపు కేసులో ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీ పార్థసారథికి చెందిన రూ.134.02 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం తెలిపింది. ఈ సమాచారాన్ని ఇడీ ఎక్స్‌లో పోస్టు చేస్తూ పార్థసారధి కుమారుడి పేరిట ఉన్న కేఫిన్ టెక్నాలజీస్ ప్రిఫరెన్స్ షేర్లను జప్తు చేశామని పేర్కొంది. ఒక్కోటి రూ.200 ముఖవిలువ కలిగిన నాన్-కన్వర్ట్‌బుల్ ప్రిఫరెన్స్ షేర్లను ఎటాచ్ చేసింది. దీంతో కేఎస్‌బీఎల్ కేసులో ఇప్పటివరకూ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.2,229.56 కోట్లకు చేరింది.
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లకు చెందిన రూ.70.39 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు వేరొక పోస్టులో ఈడీ తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసపుచ్చిన కేసులో ఈ చర్య తీసుకుంది. రూ.28.48 కోట్ల విలువైన పెయింటింగ్స్, శిల్పాలు, రూ.5 కోట్ల వాచీలు, రూ.10.71 కోట్ల డైమండ్ జ్యువెలరీ, ఒక హెలీకాప్టర్‌లో ఉన్న రూ.9 కోట్ల విలువైన 20 శాతం వాటాను, బంద్రాలో రూ.17.10 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నామన్నది. దీంతో ఈ కేసులో ఎటాచ్ చేసిన ఆస్తుల మొత్తం రూ.2,095.94 కోట్లకు చేరినట్టు ఈడీ తెలిపింది.