రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.27 వేల కోట్లతో రేవంత్ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నది. పదేండ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే సత్తావున్నదా? లేక షెల్ కంపెనీయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం బాబు డైరెక్షన్లోనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.27 వేల కోట్ల పెట్టుబడుల పెట్టేందుకు ముందుకొచ్చింది. అసలీ ఈ కంపెనీ తెలంగాణకు ఎలా వచ్చింది? ఇంతటి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే సత్తావున్నదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ సంబంధాలతో అడుగుపెట్టిందా..? లేక నిజంగానే ఈ కంపెనీకు అంత ఆర్థిక సత్తా ఉందా? ఇదేమైనా డొల్ల కంపెనీయా..? అని విద్యుత్తు రంగ నిపుణులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలే ఎకోరెన్ ఇండియా ఎనర్జీ లిమిటెడ్.. టీజీ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,279 మెగావాట్ల విండ్ – సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌తోపాటు 1,650 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్, 650 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే ఎకోరెన్ ఎనర్జీ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జెట్ స్పీడ్‌తో ఆగమేఘాల మీద అనుమతులొచ్చాయి. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో రూ.1,600 కోట్లకు పైగా పెట్టుబడులకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ కంపెనీ ప్రమోటర్ అయిన యెర్నేని లక్ష్మీప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్న అనంతపూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా ప్రభుత్వం రూ.970 కోట్ల పెట్టుబడులకు రెడ్‌కార్పెట్ పరిచింది. ఆ వెంటనే ఇదే సంస్థ రూ.27వేల కోట్లను పెట్టుబడి పెడతామని తెలంగాణకు వచ్చింది. వాస్తవానికి ఈ సంస్థ 2010లో ఏర్పాటైనట్టు తెలుస్తున్నది. ఇంత తక్కువ వ్యవధిలో అంత టర్నోవర్ ఎలా సాధించిందన్న దానిపై అనుమానాలొస్తున్నాయి. ఎకోరెన్ అనుబంధ సంస్థ అయిన బోరియాస్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య తలెత్తిన వివాదం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వద్దకు చేరింది. కర్ణాటకలోని బల్లారిలో 175 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటుచేసిన సంస్థ రూ.2.77కు యూనిట్ చొప్పున సరఫరా చేస్తామన్నది. 2020 డిసెంబర్ వరకు పూర్తిచేయాల్సి ఉండగా, నిర్మాణం పూర్తికాలేదు. దీంతో వివాదానికి దారితీసింది.
ఏకోరెన్ ఎనర్జీ ఇండియా సంస్థ వ్యవస్థాపకులైన యెర్నేని లక్ష్మీప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేశ్‌కు సమీప బంధువుట. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబుకున్న పొలిటికల్ లింకులతోనే ఎకోరెన్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే బాబు డైరెక్షన్లోనే ఈ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు, తెలంగాణ సర్కారు బాబు డైరెక్షన్లోనే అనుమతులిచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవలి కాలంలో కొందరు రాజకీయ నేతలు తమ అవినీతి సొమ్మును కంపెనీల పేరుతో తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ఉర్సా క్లస్టర్స్ పెట్టుబడుల వ్యవహారం అటు ఏపీలో ఇటు తెలంగాణలో దుమారం రేపుతున్న తరుణంలో అందరి దృష్టి ఎకోరెన్ కంపెనీపై పడింది. ఈ కంపెనీకి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే సత్తా ఉందా.. లేక ఈ 27వేల కోట్ల పెట్టుబడుల తెర వెనుక ఎవరైనా ఉన్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఎకోరెన్ సంస్థ గత చరిత్ర, టర్నోవర్లను పరిశీలంచే ఎంఓయూ కుదుర్చుకున్నాం. అన్ని కోణాల్లో పరిశీలించాం. ఈ కంపెనీలకు కొత్తగా ఎలాంటి రాయితీలివ్వడం లేదు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో ప్రకటించిన రాయితీలే వర్తిస్తాయి. స్థలాలను ఆయా కంపెనీలే సేకరించుకోవాలి. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నీటిపారుదల శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.