EV 2 Wheelers | గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతున్నది. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాల వాడకం దారులు ఈవీ టూ వీలర్స్ వైపు మొగ్గుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ గిరాకీ వల్ల వచ్చే ఏడాది చివరికల్లా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయాలు 10 లక్షల మార్కును దాటతాయని భావిస్తున్నారని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెంపు,చౌక ధరకే ఈవీ టూ వీలర్స్ లభ్యం కావడం కారణం అంటున్నారు. ప్రత్యేకించి వాహనాల తయారీ సంస్థలు గ్రామీణ మార్కెట్ విస్తరణపై కేంద్రీకరిస్తున్నాయి. ఈవీ టూ వీలర్స్ లో వినియోగించే ఇంప్రూవ్డ్ బ్యాటరీ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ ఫీచర్లతో వాటి విక్రయాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
పర్యావరణం పట్ల అవగాహన, ప్రభుత్వ రాయితీలు, టెక్నాలజీలో మార్పులతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం గిరాకీ పెరుగుతుందని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైడర్ ఖాన్ చెప్పారు. 2024 చివరికల్లా ఈవీ టూ వీలర్స్ డిమాండ్ 10 లక్షల మార్కును దాటుతుందని చెప్పారు. వచ్చే ఏడాది తమ సంస్థ 30 వేల ఈవీ టూ వీలర్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.