పటాన్చెరు రూరల్, నవంబర్ 18 : ద్రవ్యోల్బణంతో సామాన్యులపై అధిక భారం పడనున్నదని, ధరల పెరుగుదలలో స్థిరత్వం చూపించాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంక్‌దేనని రిజర్వ్‌బ్యాంక్ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంగళవారం గీతం హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆయన కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధి, భవిష్యత్తు అనే అంశంపై మాట్లాడారు. ధరల స్థిరత్వంగా చూడాల్సిన సెంట్రల్ బ్యాంక్ బాధ్యత అయినప్పటికీ, సరఫరాలో లోపాలు తలెత్తినప్పుడు పన్ను సర్దుబాట్లు లేదా సబ్సిడీలు వంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.
ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక లక్ష్యాలతో, తిరిగి ప్రజామోదం పొందే లక్ష్యంతో పనిచేస్తాయి కాబట్టీ సెంట్రల్ బ్యాంక్‌కు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. అధిక ద్రవ్యోల్భణం, ప్రతి ద్రవ్యోల్భణం రెండూ ఆర్థిక పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. వడ్డీ రేట్లు, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ఆర్బీఐ ద్రవ్య లభ్యతను ఎలా నిర్వహిస్తుందో విశ్లేషించారు. ద్రవ్యోల్బణ అంచనాలు స్వీయ-సంతృప్తిగా మారగలవు కాబట్టీ, కేంద్ర బ్యాంకులు వాటిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.