Dunzo | రిలయన్స్ మద్దతుతో పని చేస్తున్న క్విక్ కామర్స్ సంస్థ ‘డుంజో (Dunzo)` కో-ఫౌండర్ దల్వీర్ సూరీ సంస్థ నుంచి వైదొలగనున్నారు. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డుంజో యాజమాన్యం భారీగా పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక సిద్ధమైందని ప్రకటించింది. కొన్ని నెలలుగా నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్న డుంజో.. తన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఈ త్రైమాసికంలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికే మూడుసార్లు ఉద్యోగులను ఇండ్లకు సాగనంపిన డుంజో.. డార్క్ స్టోర్లు సగం మూసేసింది. కొందరు ఉద్యోగుల వేతనాల చెల్లింపులు వాయిదా వేసి, మరికొందరి వేతనాల్లో కోత విధించిన నేపథ్యంలో దల్వీర్ సూరీ వైదొలగనుండడం చర్చనీయాంశంగా మారింది.
2015లో డుంజోలో చేరిన దల్వీర్ సూరీ.. బిజినెస్ టు బిజినెస్ యూనిట్.. ‘డుంజో మర్చంట్ సర్వీసెస్’కు సారధ్యం వహించారు. దల్వీర్ సూరీ వచ్చాకే మర్చంట్ విభాగం పుంజుకున్నదని సీఈఓ కబీర్ విశ్వాస్ చెప్పారు. 25-40 మిలియన్ డాలర్ల నిధుల కోసం రిలయన్స్ రిటైల్’తో డుంజో జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే.. సంస్థలో రిలయన్స్ వాటా 25.8 శాతానికి పెరుగుతుంది. ఇదిలా ఉంటే దల్వీర్ సూరీ ఎప్పుడు సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతారన్న సంగతిపై స్పష్టత లేదు. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్న సంగతి డుంజో వెల్లడించలేదు.