Dunkin’ Donuts : మన దేశంలో చాలా మంది ఫుడ్ లవర్స్‌కు ఇష్టమైన డంకిన్ డోనట్స్ బ్రాండ్ ఇండియాకు గుడ్‌బై చెప్పబోతుంది. ఇండియాలోని భాగస్వామ్య సంస్థతో కుదుర్చుకున్న ఫ్రాంచైజ్ ఒప్పందం ముగియనుండటంతో డంకిన్ డోనట్స్ సంస్థ ఇండియాను వీడబోతుంది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కాఫీ అండ్ డోనట్స్ సంస్థ డంకిన్ డోనట్స్. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సంస్థ స్టోర్స్ కనిపిస్తుంటాయి. అయితే, ఈ సంస్థ ఇక్కడ నేరుగా వ్యాపారం చేయడం లేదు. ఇండియాకు చెందిన జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ అనే సంస్థ, డంకిన్ డోనట్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది ఫ్రాంచైజీ ఒప్పందం. డంకిన్ డోనట్స్ పేరు మీదే జుబిలెంట్ సంస్థ స్టోర్స్ నిర్వహిస్తుంటుంది. దేశంలో వ్యాపారాన్ని ఈ సంస్థే చూసుకుంటుంది. జుబిలెంట్, డంకిన్ డోనట్స్ సంస్థల మధ్య ఫిబ్రవరి 24, 2011న ఫ్రాంచైజీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. అయితే, ఒప్పందాన్ని జుబిలెంట్ సంస్థ పొడిగించలేదు. డంకిన్ డోనట్స్ ఫ్రాంచైజీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత డంకిన్ డోనట్స్ స్టోర్స్ క్లోజ్ అవుతాయి. అంటే వచ్చే ఏడాది నుంచి ఈ సంస్థ స్టోర్లు పనిచేయవు. అయితే, ఒకేసారి కాకుండా, దశలవారీగా దేశంలోని స్టోర్లను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రమంగా డంకిన్ స్టోర్లు మూతబడుతాయి. కొన్ని చోట్ల అవసరమైతే నిబంధనల ప్రకారం స్టోర్లను ఇతరులకు అప్పగించే అవకాశం కూడా ఉంది. పూర్తిగా స్టోర్లను అమ్మేయడం లేదా బదిలీ చేయడం చేస్తారు.
ఇతర బ్రాండ్లు, ప్రధాన మార్కెట్లపై దృష్టి పెట్టే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జుబిలెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఇప్పటికే డంకిన్ డోనట్స్ బోర్డుకు అధికారికంగా వివరించినట్లు తెలిపింది. అయితే, ఇటీవలి కాలంలో వరుసగా నష్టాలు రావడం, కంపెనీ ఎదుగుదల మందగించడం వంటివి ప్రధాన కారణాలు అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక, జుబిలెంట్ సంస్థ 1995లో ప్రారంభమైంది. ఇండియాతోపాటు బంగ్లాదేశ్, టర్కీ, శ్రీలంక, జార్జియా, అజర్ బైజాన్ దేశాల్లో ఈ సంస్థ 3,500కుపైగా స్టోర్లు కలిగి ఉన్నాయి. డొమినోస్ వంటి సంస్థలతో కూడా ఈ కంపెనీ ఒప్పందం కలిగి ఉంది.