హైదరాబాద్, జనవరి 23: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,413 కోట్ల నికర కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,379 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం రెండు శాతం వృద్ధిని కనబరిచింది. అన్ని మార్కెట్లు ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబరచడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.7,215 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.8,359 కోట్లకు ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..నూతనంగా కొనుగోలు చేసిన ఎన్ఆర్టీ బిజినెస్ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నదనని, నూతన ఔషధాలు విడుదల చేయడం, నిర్వహణ పనితీరు మెరుగుపడటం కూడా కలిసొచ్చిందన్నారు.
గత త్రైమాసికంలో అమెరికా నుంచి రూ.3,383 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అలాగే భారత్‌లో విక్రయాలు రూ.1,180 కోట్ల నుంచి రూ.1,346 కోట్లకు పెరగగా, వృద్ధిపరంగా చూస్తే 14 శాతం అధికమైందన్నారు. యూరప్ నుంచి రూ.1,210 కోట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.1,436 కోట్ల ఆదాయం సమకూరింది. మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ.1,289.35 వద్ద ముగిసింది.