గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 29, 2020 , 01:44:17

రెడ్డీస్‌ ప్రాఫిట్‌ డౌన్‌

రెడ్డీస్‌ ప్రాఫిట్‌ డౌన్‌

  • క్యూ2లో రూ.762 కోట్లకు పరిమితం 
  • రూ.4,897 కోట్లుగా ఆదాయం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను  విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.762.30 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.1,092.5 కోట్ల లాభంతో పోలిస్తే 30.22 శాతం తగ్గినట్లు సంస్థ బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌కి సమాచారం అందించింది. ఆదాయం రూ.4,800.90 కోట్ల నుంచి రూ.4,896.70 కోట్లకు పెరిగినట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు. గతేడాది రెండో త్రైమాసికంలో పన్ను ప్రయోజనాల ద్వారా అత్యధిక నిధులు సమకూరడం వల్లే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

సైబర్‌ దాడితో ప్రభావం నిల్‌

డాక్టర్‌ రెడ్డీస్‌పై సైబర్‌ దాడి జరిగింది నిజమేనని, అయితే ఎలాంటి ప్రభావం పడలేదని చక్రవర్తి వ్యాఖ్యానించారు. కాగా,  తిరిగి అన్ని ఉత్పత్తులు ప్రారంభించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

మార్చి నాటికి మూడో దశ

రష్యా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పరీక్ష కోసం రెడ్డీస్‌కు భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతులు పొందిన సంస్థ ట్రయల్స్‌ను వేగవంతం చేస్తున్నది.  ఏడాది చివరి నాటికి రెండో దశ ట్రయల్స్‌ను పూర్తి చేయనున్న సంస్థ..వచ్చే ఏడాది మార్చి నాటికి మూడో దశ కూడా పూర్తి చేయనున్నట్లు కంపెనీ సీఈవో ఏరెజ్‌ ఇజ్రాయిల్‌ తెలిపారు. 

  • అంతర్జాతీయంగా జనరిక్‌ ఔషధాలను విక్రయించడం ద్వారా రూ.3,980 కోట్లు సమకూరాయి. గతేడాదితో పోలిస్తే 21 శాతం వృద్ధి
  • యూరప్‌ నుంచి రూ.380 కోట్లు, ఇండియా నుంచి రూ.910 కోట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి రూ.860 కోట్లు లభించాయి. 
  • పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి రూ.440 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా 94 జనరిక్‌ ఔషధాలను ఫైలింగ్‌ చేసింది. 
  • కంపెనీ షేరు ధర 0.20 శాతం తగ్గి రూ.5,090.20 వద్ద ముగిసింది.