ముంబై, ఏప్రిల్ 22: ఈ ఏడాది రెపోరేటు రెండు లేదా మూడుసార్లు తప్పక పెరుగుతుందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కెకీ మిస్త్రీ అంచనా వేశారు. రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డ మిస్త్రీ.. వడ్డీరేట్ల విషయంలో ఆర్బీఐ తీరును తప్పుబట్టలేమన్నారు. నిజానికి ఉపాధి కల్పన, ప్రజల ఆదాయం పెరగడానికి, వినియోగ సామర్థ్యం పుంజుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ప్రగతి అన్నది దేశానికి చాలా ముఖ్యమన్నారు. ఈ క్రమంలోనే వడ్డీరేట్లు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదన్నారు. శుక్రవారం ఓ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మిస్త్రీ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం విషయంలో భారత్-అమెరికాల మధ్య పోలిక వద్దన్నారు. అమెరికాలో ఎప్పుడూ ద్రవ్యోల్బణం ఎక్కువేనని, భారత్లో తక్కువేనని చెప్పారు. అక్కడ 8.5 శాతానికిపైగా ఉంటే, ఇక్కడ 5.7 శాతం వద్దే ఉందన్నారు.