ముంబై, ఏప్రిల్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం పడిపోయి 77,664 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 942.31 పాయింట్లు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 205.05 పాయింట్లు లేదా 0.84 శాతం కోల్పోయి 24,173.05 దగ్గర నిలిచింది. వరుసగా 3 రోజులు లాభాల్లో కదలాడి బుధవారం సెన్సెక్స్ 757, నిఫ్టీ 198 పాయింట్లు క్షీణించిన విషయం తెలిసిందే.
కాగా, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరోమారు స్తంభించాయన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ విజృంభించాయి. బ్యారెల్ క్రూడాయిల్ రేటు 100 డాలర్లను దాటేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషించారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.39 శాతం, స్మాల్‌క్యాప్ 0.34 శాతం పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు నిరాశపర్చాయి.