ముంబై, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమ్మకాలు పోటెత్తడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీల నుంచి అతి విలువైన లోహాల వైపు మళ్లించడం పతనానికి ఆజ్యంపోసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి ఒక్క శాతానికి పైగా వాటాను కోల్పోయాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 769.67 పాయింట్లు కోల్పోయి 81,537.70 వద్ద నిలిచింది.
మరో సూచీ నిఫ్టీ 241.25 పాయింట్లు నష్టపోయి 25,048.65 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.7 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,95,963.98 కోట్లు కరిగిపోయి రూ.4,51,56,045.07 కోట్లు (4.93 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. మొత్తంమీద ఈ వారంలో మదుపరులు రూ.16, 28,561.85 కోట్ల సంపదను నష్టపోయారు. ప్రపంచ మార్కెట్లు, పీఎంఐ డాటా ఆశాజనకంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తుతున్నాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం, ఎఫ్ఐఐల అమ్మకాలు, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు.
సెన్సెక్స్ 769,నిఫ్టీ 241 పాయింట్ల నష్టం