ముంబై, జూన్ 3 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం మార్కెట్లను నష్టాలవైపు నడిపించాయి. ఎనర్జీ, ఫైనాన్స్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఒక దశలో ఒక్క శాతానికి పైగా నష్టపోయిన సూచీలు చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి. ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 636.24 పాయింట్లు కోల్పోయి 80,737.51 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 174.10 పాయింట్లు కోల్పోయి 24,542.50 పాయింట్ల వద్ద ముగిసింది. షేర్లలో 2,266 సూచీలు నష్టపోగా..1,731 సూచీలు పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయని, భౌగోళిక రాజకీయ సమస్యలు మరింత ముదురుతుండటం, డాలర్ బలహీనపడటం కూడా సూచీల పతనానికి ఆజ్యంపోశాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
యెస్ బ్యాంక్ షేరు కుప్పకూలింది. బ్యాంక్ షేరు 10.40 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కాైర్లెల్ గ్రూపు..యెస్ బ్యాంక్లో తన వాటాను 2.6 శాతం విక్రయిస్తున్నట్టు ప్రకటించడంతో బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది.
అదానీ గ్రూపు షేర్లు భారీగానష్టపోయాయి. అదానీ పోర్ట్ అత్యధికంగా 2.42 శాతం నష్టపోగా, ఎన్డీటీవీ 2.25 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 2.18 శాతం, అదానీ పవర్ 2.02 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.89 శాతం మేర నష్టపోయాయి. దీంతోపాటు అదానీ టోటల్ గ్యాస్ 1.62 శాతం, అదానీ గ్రీన్ 1.58 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.16 శాతం, అంబుజా సిమెంట్, ఏసీసీ, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ షేర్లు నష్టపోయాయి.