ముంబై, మార్చి 30 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు దేశీయ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవడంతో 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కూడా నష్టాలనే చవిచూశాయి సూచీలు. క్రూడాయిల్ భగ్గుమంటుండటం పతనానికి ఆజ్యంపోసింది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఇంట్రాడేలో 1,800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 72 వేల పాయింట్ల కిందకు పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టపోయి 71,947.55 వద్ద ముగిసింది. సూచీల్లో 3,563 షేర్లు పతనం కాగా, 876 షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం కోల్పోయి 22,331.40 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ల భారీ పతనంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 3,325.9 పాయింట్లు లేదా 4.44 శాతం నష్టపోవడంతో మదుపరులు రూ.18.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18,60,662.29 కోట్లు కరిగిపోయి రూ.4,12,41,172.45 కోట్ల(4.36 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్ 9,339.64 పాయింట్లు లేదా 11.48 శాతం నష్టపోయింది. పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలుండటం మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని జియోజిట్ ఫైనాన్షియల్ రిసెర్చ్ అధినేత వినోద్ నాయర్ తెలిపారు.
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా బీఎస్ఈ, అటు ఎన్ఎస్ఈలు సెలవు పాటించనున్నాయి. అలాగే ఈ శుక్రవారం(ఏప్రిల్ 3) గుడ్‌ఫ్రైడే సందర్భంగా సూచీలు సెలవుపాటించనున్నాయి. దీంతో ఈవారంలో సూచీల ట్రేడింగ్ మూడు రోజులకు పరిమితం కానున్నది.