ముంబై, ఆగస్టు 6 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 166.26 పాయింట్లు లేదా 0.21 శాతం పడిపోయి 80,543.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 261.43 పాయింట్లు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 75.35 పాయింట్లు లేదా 0.31 శాతం కోల్పోయి 24,574.20 వద్ద స్థిరపడింది.
ఇంట్రా-డేలో 110.35 పాయింట్లు నష్టపోయింది. ఐటీ, హెల్త్‌కేర్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య సమీక్షలో రెపోరేటు యథాతథంగానే ఉండటంతో ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లకూ మదుపరులు దూరంగా ఉన్నారు. ఆఖర్లో ఆయా రంగాలకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది.