దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త ఏడాదిలో మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేస్తున్నారు. ఇటీవలి ఒడిదొడుకులు దీనికి రుజువు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,844.20 పాయింట్లు లేదా 2.32 శాతం క్షీణించి 77,378.91 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 573.25 పాయింట్లు లేదా 2.38 శాతం పతనమై 23,431.50 దగ్గర స్థిరపడింది. దీంతో ఈ వారం కూడా ట్రేడింగ్‌లో ఒడిదొడుకులకు ఆస్కారముందని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు మార్కెట్లను నడిపిస్తాయన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక డాలర్‌తో పోల్చితే అంతకంతకూ పడిపోతున్న రూపాయి మారకం విలువ.. మార్కెట్ లాభాలను ఆవిరిచేస్తున్నది. దీంతో రూపీ పెరిగితే మార్కెట్లకు కలిసిరానున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,800-24,100 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.