ఆడుతూ పాడుతూ పని, ఆకర్షణీయ వేతనాలు, విలాసవంతమైన జీవితం. ఇదీ.. ఐటీ రంగంలో కొలువుల తీరు. అయితే నిన్నమొన్నటిదాకా ఇలా ఉండచ్చేమోగానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైంది. కొరవడిన ఉద్యోగ భద్రత, జీతాల్లో కోతలు, ఒత్తిడితో కూడిన జీవనం.
ఇదీ.. ఐటీ రంగ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి. సాంకేతిక మార్పులు, పెరుగుతున్న పోటీ, పడిపోతున్న ఆదాయం ఇలా.. ఎన్నెన్నో అంశాలు ఐటీ కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీసీఎస్ ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇప్పుడిది అటు ఉద్యోగుల్లో, ఇటు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెచ్చిన కొత్త పాలసీ ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. గత నెల జూన్ 12న అమల్లోకి వచ్చిన ఈ విధానంలో 35 రోజుల బెంచ్ పాలసీ డెడ్‌లైన్ తాజాగా ముగిసింది. దీంతో సంస్థ ఉద్యోగులకు గుబులు పట్టుకుంటున్నది. వేలాది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అనిశ్చితిని చూడాల్సి వస్తున్నది మరి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ పాలసీ వర్తిస్తుండటం గమనార్హం.
ఏ ప్రాజెక్టులో భాగస్వామి కాకుండా ఏడాదిలో గరిష్ఠంగా 35 రోజుల కంటే ఎక్కువ రోజులు సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగీ ఉండరాదు. అలా ఉన్నైట్టెతే వారి ఉద్యోగం రిస్క్‌లో పడ్డట్టే. ఫ్రెషైర్లెతే ఉద్యోగాల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే పైస్థాయి ఉద్యోగులైతే కిందిస్థాయికి దిగజారే వీలున్నది. సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు దక్కకపోవచ్చు. వేతనాలు, ఇతర అలవెన్సుల్లో కోతలుపడే అవకాశాలూ లేకపోలేదు. ఇక ఏడాది కాలవ్యవధిలో ప్రతీ ఉద్యోగి నేరుగా క్లెయింట్ లేదా ప్రాజెక్టుతో కనీసం 225 రోజులు తప్పక పనిచేయాల్సి ఉంటుంది. మిగతా సమయాన్ని ఇంటర్నల్ టాస్క్‌లు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఏఐ-క్లౌడ్ టెక్నాలజీ వంటి కొత్త సాంకేతికతల్ని అందిపుచ్చుకోవడం, ఇతర కార్యకలాపాల కోసం వెచ్చించవచ్చు.
కొత్త పాలసీతో తాము విపరీతమైన ఒత్తిడిలోకి వెళ్లిపోతున్నామని టీసీఎస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణలో తాము నేర్చుకున్న పనుల్లోకి కాకుండా వేరే బాధ్యతల్ని అప్పగిస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగ భద్రత, పదోన్నతులు, ప్రాజెక్టుల కేటాయింపుల వంటి అంశాల్లో వారికి దిగులు పట్టుకుంటున్నది. ‘వినియోగం ఆధారంగా ఉద్యోగుల్ని హేతుబద్ధీకరించడం ఇదే తొలిసారి. ఉద్యోగాల తొలగింపునకే ఇది దారితీయగలదు’ అని సోషల్ మీడియా వేదిక రెడిట్‌లో ఓ టీసీఎస్ ఉద్యోగి పేర్కొన్నారు. అలాగే ‘టీసీఎస్‌లో నేను ఇటీవలే చేరాను. జావాలో శిక్షణ పొందుతున్నాను. కానీ నెల రోజులు కూడా కాకముందే అందుకు భిన్నం గా సపోర్టింగ్ ప్రాజెక్టులో చేరాలన్న ఒత్తిళ్లు వస్తున్నాయి’ అని మరో ఉద్యోగి చెప్తున్నారు.
టీసీఎస్ కొత్త విధానంపై ఐటీ ఎంప్లాయీస్ యూనియన్.. నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరుతూ కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాకు ఓ లేఖను కూడా రాసింది. కంపెనీ పాలసీ అమానవీయంగా ఉందని, ఉద్యోగులు మానసిక క్షోభకు గురయ్యేలా చేస్తున్నదని, ఈ తరహా కఠిన విధానాలను అడ్డుకోవాలని ఇందులో ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలుజా కోరారు.
నిజానికి టీసీఎస్ నూతన విధానం.. పనిచేయని ఉద్యోగులపైనేగాక, నైపుణ్యం ఉండి కూడా తాత్కాలికంగా ప్రాజెక్టులు దొరకని ఉద్యోగుల్నీ శిక్షించేలా ఉందన్నారు. అయితే చాలామంది ఉద్యోగులు ప్రాజెక్టుల్ని ఏండ్ల తరబడి తిరస్కరిస్తూ సొంత పనుల్ని చేసుకుంటున్నారని.. అలాంటివారిని వదిలించుకొని, సమర్థులకు అవకాశాలు రావాలంటే కంపెనీ పాలసీ సరైనదేనంటున్న ఉద్యోగులూ ఉంటున్నారు.
ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. తద్వా రా బెంచ్ టైమ్‌ను తగ్గించడానికి కృషి చేస్తు న్నాం. శిక్షణ, డిమాండ్, నైపుణ్యం ఆధారంగా ఉద్యోగులకు ప్రాజెక్టుల్ని కేటాయిస్తాం. అయినా క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులుంటాయి. మన (ఉద్యోగుల) వ్యక్తిగత ఛాయిస్‌గా ఉండవు. నిజానికి ఎప్పట్నుంచో వేచిచూసిన నిర్మాణాత్మక విధానమే ఈ కొత్త పాలసీ. ఇందులో ఉద్యోగులు తమ కెరియర్ కోసం బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారు.
-కే కృతీవాసన్, టీసీఎస్ సీఈవో, ఎండీ