Industrial Growth | న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గనులు, విద్యుత్, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 11.9 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో మొత్తం పారిశ్రామిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపింది. క్రితం ఏడాది ఇదే నెలలో 13.1 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న గనుల రంగం అక్టోబర్ నెలకుగాను 0.9 శాతానికి పరిమితమైంది. అలాగే తయారీ రంగం కూడా 10.6 శాతం నుంచి 4.1 శాతానికి పరిమితమైంది. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా 20.4 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది.
2023 అక్టోబర్ నెలలో 21.7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న క్యాపిటల్ గూడ్స్ రంగం ఈసారికిగాను 3.1 శాతానికి పరిమితమైంది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ రంగ వృద్ధి 2.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇది 9.3 శాతంగా నమోదైంది. కానీ, వినియోగదారుల మన్నికైన వస్తువుల ఉత్పత్తి విభాగం 5.9 శాతం వృద్ధిని కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో పారిశ్రామిక వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇది 7 శాతంగా ఉన్నది.
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరల సూచీ ఎట్టకేలకు శాంతించింది. నవంబర్ నెలలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 5.48 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో నమోదైన 6.21 శాతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. ఆహార పదార్థాలు తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా కూరగాయలు చౌక కావడం వల్లనే రిటైల్ ధరల సూచీ తగ్గుముఖం పట్టిందని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఆహార పదార్థాల ధరల సూచీ 9.04 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 8.70 శాతంతో పోలిస్తే పెరగగా, అక్టోబర్లో నమోదైన 10.87 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది.