న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నూతన సంవత్సరంపై దేశీయ ఆటోమొబైల్ సంస్థలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే పలు వాహనాలను విడుదల చేసి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న కంపెనీలు.. వచ్చే ఏడాది తొలి నెలలోనే అర డజనుకుపైగా అప్డేటెడ్, కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, కియా, మహీంద్రాలు వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. ఇందులో ఎస్‌యూవీలు, ఈవీ మాడళ్లూ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
సెల్టోస్: కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెల్టోస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మధ్యస్థాయి ఎస్యూవీ మాడల్ అయిన ఈ సెల్టోస్‌ను కావాలనుకునేవారు ముందస్తుగా రూ.25 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు ధరను జనవరి 2న కంపెనీ ప్రకటించనున్నది.
ఈ-విటారా: దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మారుతి సుజుకీ తన పంథాను మార్చుకున్నది. ఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలపై దృష్టి సారించిన సంస్థ.. తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే ఆటో ప్రదర్శనలో చూపిన ఈ-విటారాను వచ్చే నెలలో మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారును 49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దింది. సింగిల్ చార్జింగ్‌తో 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
డస్టర్: ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్.. మార్కెట్లోకి సరికొత్త డస్టర్‌ను తీసుకురాబోతున్నది. వచ్చే నెల చివర్లో అందుబాటులోకి రానున్న ఈ కారు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయం కానున్నది.
కుషక్: మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ మాడల్ కుషక్ను విడుదల చేయబోతున్నది స్కోడా ఇండియా. పాత మాడల్‌ను మరింత ఆధునీకరించి విడుదల చేస్తున్నది. దీంట్లో పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవల్ 2 అడాస్ సిస్టమ్ తదితర నూతన ఫీచర్లున్నాయి.
ఎక్స్‌యూవీ7ఎక్స్వో: ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ7ఎక్స్వో మాడల్‌ను విడుదల చేయబోతున్నది. పూర్తి స్థాయిలో ఇంటీరియర్‌ను మార్చివేసిన సంస్థ.. ట్రిపుల్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ లేఅవుట్, ముందుభాగంలో మెసేజ్ ఫ్రంట్ సీట్స్, వెనుకాల వెంటిలేటెడ్ సీట్స్, ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసింది.
పంచ్: మైక్రో-ఎస్యూవీ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి టాటా మోటర్స్ నయా పంచ్‌ను విడుదల చేస్తున్నది. పాతదాంతో పోలిస్తే కొత్త మాడల్‌ను అప్డేట్ చేసింది. దీంట్లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. సీఎన్జీ మాడల్ కూడా ఉండటం విశేషం. అలాగే పంచ్ ఈవీని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నది.
గ్రావిటే: కంప్యాక్ట్ ఎంపీవీ సెగ్మెంట్లోకి ప్రవేశించడంలో భాగంగా నిస్సాన్.. సరికొత్త గ్రావిటే మాడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు.. వచ్చే నెలలో దేశీయ మార్కెట్‌కు పరిచయం అవుతున్నది.